Ad Code

అశ్వగంధ ఔషధంపై బ్రిటన్‌ పరిశోధన

 

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆయుర్వేద ఔషధాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వీటిలో ముఖ్యంగా పోస్ట్‌, లాంగ్‌ కొవిడ్‌ రోగులు అశ్వగంధ నుంచి తయారుచేసిన ఔషధం ద్వారా ఎంతో ప్రయోజనం పొందారు. ఈ ఔషధం ప్రయోజనాలు భారతదేశంలోని వివిధ అధ్యయనాల ద్వారా నిరూపితమైంది. మన దేశంలో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు తొలిసారిగా దేశం వెలుపల కొవిడ్‌ రోగులకు అశ్వగంధ ఔషధం ఇచ్చి అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం భారతదేశం-బ్రిటన్ మధ్య ఒప్పందం కుదిరింది. 16 నెలల పాటు దాదాపు వంద సార్లు సమావేశమైన తర్వాత, ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ), లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్.. మూడు బ్రిటన్‌ నగరాల్లో పోస్ట్ కొవిడ్ రోగులపై ఈ ఔషధాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని లీసెస్టర్, బర్మింగ్‌హామ్, లండన్‌ నగరాల్లోని రెండువేల మంది పోస్ట్, లాంగ్ కొవిడ్ రోగులపై అధ్యయనం జరుగుతుందని ఏఐఐఏ డైరెక్టర్, ప్రాజెక్ట్‌కో-ఇన్వెస్టిగేటర్ డాక్టర్ తనూజ మనోజ్ నేసరి తెలిపారు. ప్రతి వేయి మందితో రెండు గ్రూపులను తయారు చేయడం ద్వారా ఈ అధ్యయనం జరుపనున్నారు. అనంతరం రెండు గ్రూపుల తులనాత్మక అధ్యయనం చేపట్టి ఫలితాను విశ్లేషిస్తారు. ఇటీవల భారతదేశంలో మానవుల్లో అనేక పరీక్షల్లో అశ్వగంధ ప్రభావవంతంగా ఉన్నదని ఎత్తి చూపారని డాక్టర్‌ తనూజ నేసరి పేర్కొన్నారు. కొవిడ్‌-19 దీర్ఘకాలిక లక్షణాలను తగ్గించడానికి అశ్వగంధ సరైన చికిత్సా ఎంపిక అని ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు నిరూపించాయి.

Post a Comment

0 Comments

Close Menu