తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన అనంతరం కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి తనను తప్పించే ఆలోచనే లేదని, సురేఖను తీసేయకపోతే తానే వెళ్లిపోతానని సీఎం రేవంత్ స్వయంగా అధిష్ఠానాన్ని బ్లాక్‌మెయిల్ చేసి ఈ పని చేయించారని మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణ చేశారు. ఉరిశిక్ష పడిన ఖైదీని సైతం చివరి కోరిక అడుగుతారని, కానీ తనను కనీసం సంప్రదించకుండానే అన్యాయంగా పదవి నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఎస్‌తో గవర్నర్‌కు పంపిన లేఖపై లెటర్‌హెడ్ గానీ, కనీసం సంతకం గానీ లేదని తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి సోదరులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మాజీ టీడీపీ నేతలంతా ఒక్కటై కుట్రపూరితంగా తనను బలిపశువును చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారని, టీడీపీ రక్తం ఉన్నవారే ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తారని సురేఖ మండిపడ్డారు. వేం నరేందర్ రెడ్డి లాంటి వ్యక్తులతో తనపై మైండ్ గేమ్ ఆడిస్తున్నారని ఆరోపించారు. పదేళ్లుగా టికెట్ కోసం ప్రయత్నిస్తున్న తన కూతురు చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీగా చేసుకోలేదా, డి.శ్రీనివాస్ ఇంట్లో రెండు పార్టీల వారు లేరా అని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయని తనపైనే వేటు వేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తనను టార్గెట్ చేసే క్రమంలోనే సీనియర్ నేత చిన్నారెడ్డిని సైతం బలి చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవడం సరికాదని సురేఖ పేర్కొన్నారు. తనపై తీసుకున్న ఈ నిర్ణయం ముమ్మాటికీ కక్షపూరిత చర్యేనని ఖండించారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే అనుచరులతో చర్చించి భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
0 Comments