తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించే దిశగా జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. ఉమ్మడి ఖమ్మం-నల్లగొండ-వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల బరిలో తమ అభ్యర్థిని నిలపాలని నిర్ణయిస్తూ, పార్టీ ముందస్తు ప్రకటన విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర నాయకుడు, అధికార ప్రతినిధి , ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన సమన్వయకర్తగా పనిచేస్తున్న డాక్టర్ గడల శ్రీనివాసరావు పేరును ఈ స్థానానికి ఎంపిక చేశారు. జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ ప్రతిపాదించిన ఈ నిర్ణయానికి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదం తెలపడంతో రంగం సిద్ధమైంది. డాక్టర్ గడల శ్రీనివాసరావు తెలంగాణ ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. గతంలో తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడిగా అత్యున్నత బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి వైద్య సేవలను సమన్వయం చేయడంతో పాటు, ప్రభుత్వ విధానాల అమలులో కీలక పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. పరిపాలనపై సమగ్ర పట్టు, ప్రజా సమస్యలపై లోతైన అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.ప్రభుత్వ సర్వీస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం గడల శ్రీనివాసరావు రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. తన సొంత ప్రాంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణవ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన ఆయన, అనతికాలంలోనే పార్టీ నాయకత్వంలో కీలక స్థానాన్ని దక్కించుకుని ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. పట్టభద్రులైన ఉద్యోగులు, విద్యావంతులు, యువతతో ఉన్న విస్తృత సంబంధాలు ఆయన అభ్యర్థిత్వానికి కలిసివచ్చే ప్రధాన అంశాలుగా జనసేన వర్గాలు భావిస్తున్నాయి.
0 Comments