Ad Code

ఢిల్లీ ఎయిమ్స్‌లో మహిళా పేషెంట్‌తో అనుచిత ప్రవర్తించిన సెక్యూరిటీ గార్డు : విధుల నుంచి తొలగించి, జరిమానా విధించిన ఎయిమ్స్

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఒక మహిళా పేషెంట్‌తో సెక్యూరిటీ గార్డు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో   అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎయిమ్స్ ప్రకటించింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఒక మహిళా పేషెంట్‌తో అక్కడ విధుల్లో ఉన్న ధనంజయ్ సింగ్ అనే సెక్యూరిటీ గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. దీనిపై పేషెంట్ కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎయిమ్స్ ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపారు. ఈ ఘటనలో గార్డు ధనంజయ్ సింగ్ అభ్యంతరంగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో వెంటనే అతడిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ఎయిమ్స్ ప్రకటించింది. అంతేకాకుండా అతడికి జరిమానా కూడా విధిస్తున్నట్లు తెలిపింది. అలాగే, ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయించామని ఒక ప్రకటనలో పేర్కొంది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఎయిమ్స్ పరిధిలో మహిళలపై లైంగిక వేధింపులు, అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనల్ని ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మహిళా రోగులు, వారి సంబంధీకుల భద్రత, గౌరవానికి కట్టుబడి ఉన్నామని వివరించింది.

Post a Comment

0 Comments

Close Menu