Ad Code

విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ గ్లాస్ ధ్వంసం చేసిన ప్రయాణికుడు : అదుపులోకి తీసుకున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది

కౌలాలంపూర్ నుంచి కేరళలోని కొచ్చికి ప్రయాణిస్తున్న బాటిక్ ఎయిర్ OD231 విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర గందరగోళం సృష్టించాడు. విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించి ప్రయాణికులను, సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేసాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 9:30 గంటల నుంచి 11:05 గంటల మధ్య చోటుచేసుకుంది. ఈ ప్రమాదకర చర్యకు పాల్పడిన నిందితుడిని కేరళలోని పాలక్కాడ్ జిల్లా కూటనాడ్‌కు చెందిన 36 ఏళ్ల జంషీర్ అథనిక్కల్‌గా అధికారులు గుర్తించారు. జంషీర్ విమానం అత్యవసర ద్వారం తెరిచేందుకు యత్నించడమే కాకుండా, ఎగ్జిట్ విండో ప్యానెల్‌ను ధ్వంసం చేశాడు. అంతేకాకుండా తనను అడ్డుకోబోయిన తోటి ప్రయాణికులను తీవ్రంగా బెదిరించాడు. క్యాబిన్ సిబ్బంది, ఇతర ప్రయాణికులు వెంటనే స్పందించి అతడిని సమర్థవంతంగా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దిగిన వెంటనే, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది జంషీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించడం, విమాన ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అంశాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతడిని నెడుంబస్సేరి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Post a Comment

0 Comments

Close Menu