ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని జీఎం విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ నీట్ పరీక్షల నిరసనల సమయంలో ‘జెన్ జీ’ను కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 25న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల భారీ నిరసనల నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ప్రధాన్, రెండు వారాల తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ధర్నాలు చేసిన జెన్ జీలు కూడా మన పిల్లలే. కానీ కొందరు కావాలనే వారిని తప్పుదోవ పట్టించారు. దేశంలో ఏటా దాదాపు 2 కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారు. భవిష్యత్తులో దేశాన్ని విశ్వగురువుగా నిలిపేది ఈ యువతరే. నాకు పదవి కంటే ఈ 20 కోట్ల మంది యువత ఆకాంక్షలే ముఖ్యం. అందుకే ప్రధాని మోడీ వద్దకు వెళ్లి స్వయంగా రాజీనామా సమర్పించానన్నారు. రైరాఖోల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేడీ శ్రేణులు చేస్తున్న నిరసనలకు తాను భయపడనని చెప్పారు. నవీన్ పట్నాయక్ యువతను తనపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.“నేను సాధారణ రైతు బిడ్డను. గో బ్యాక్ అని ఎంత అరిచినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాను. నా వల్ల ఒడిశా ప్రజల పరువు ఎప్పుడూ పోలేదు.” అని స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలపై బీజేడీ సంబల్‌పూర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి రోహిత్ పూజారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నీట్ విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగం వల్లే విద్యాశాఖ మంత్రిగా ప్రధాన్‌కు చెడ్డపేరు వచ్చింది. ఆ దౌర్జన్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు నవీన్ పట్నాయక్‌పై ఆరోపణలు చేయడం అర్థరహితం” అని స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన సందర్భంగా నిరసనలకు దిగిన దాదాపు 30 మంది బీజేడీ కార్యకర్తలను సంబల్‌పూర్ పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు.
0 Comments