అంతర్జాతీయ మార్కెట్లలో పరిచయం చేసిన మోటో జీ మ్యాక్స్ ను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టడానికి మోటోరోలా సన్నద్ధం అవుతుంది. అయితే భారత మార్కెట్‌లో విడుదల కానున్న మోటో జీ మ్యాక్స్ వేరియంట్ అంతర్జాతీయ మోడల్‌తో పోలిస్తే కొన్ని కీలక మార్పులతో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాసెసర్, ప్రధాన కెమెరా విషయంలో భారతీయ వేరియంట్‌లో భిన్నమైన స్పెసిఫికేషన్లు ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) చేసిన పోస్టు ప్రకారం, Moto G Max భారత్‌లో ఆగస్టు 15న విడుదలయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర సుమారు రూ.30,000 ఉండొచ్చని సమాచారం. అయితే Motorola నుంచి అధికారిక ధర, లాంచ్ తేదీపై ఇంకా ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఈ వివరాలను ప్రస్తుతానికి లీక్‌గా మాత్రమే పరిగణించాలి. అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన మోటో జీ మ్యాక్స్ లో MediaTek Dimensity 6400 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అయితే భారతదేశంలో విడుదల కానున్న మోడల్‌లో Snapdragon 6s Gen 4 ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. భారత వేరియంట్‌లో ప్రాసెసర్ మార్పు చేయడం ద్వారా పనితీరు, పవర్ ఎఫిషియెన్సీ పరంగా Motorola ఎలాంటి ట్యూనింగ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారతదేశంలో విడుదల కానున్న మోడల్ వెనుక కెమెరా సెటప్‌లో 50MP Sony LYT-600 ప్రైమరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ వేరియంట్‌లో 200MP ప్రైమరీ కెమెరాను అందించారు. అంతర్జాతీయ మోడల్‌లో 200MP మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా అందించారు. 6.8 అంగుళాల 1.5K డిస్‌ప్లే ఉంటుంది. పెద్ద స్క్రీన్ కావడంతో వీడియోలు చూడటం, గేమింగ్, సోషల్ మీడియా వినియోగం వంటి పనులకు ఇది అనుకూలంగా ఉండనుంది. స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత Hello UIపై పనిచేస్తుంది. అలాగే Motorola ఈ ఫోన్‌కు రెండు OS అప్‌గ్రేడ్‌లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించే అవకాశం ఉంది. పవర్ బ్యాకప్ కోసం Moto G Maxలో 5,200mAh బ్యాటరీను అందించారు. ఇది 32W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. రోజువారీ వినియోగంలో సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, కాల్స్, బ్రౌజింగ్ వంటి పనులకు ఈ బ్యాటరీ సామర్థ్యం ఉపయోగకరంగా ఉండనుంది. ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో Moto G Maxను 8GB RAM + 256GB స్టోరేజ్ తో ఒకే వేరియంట్‌లో అందిస్తున్నారు. అక్కడ ఈ ఫోన్ Azul Claro, Graphite రంగుల్లో లభిస్తుంది. భారతదేశంలో ఎన్ని స్టోరేజ్ వేరియంట్లు, ఏ రంగుల్లో అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
0 Comments