భారత వాయుసేన (ఐఏఎఫ్) లో అత్యున్నత హోదాలో ఉన్న ఒక వింగ్ కమాండర్ పాకిస్తాన్ గూఢచారుల ‘హనీట్రాప్’ వలలో చిక్కి, దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలక రహస్యాలను శత్రుదేశం చేతిలో పెట్టిన తీవ్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్మీ ఇంటెలిజెన్స్ సైలెంట్ సైబర్ నిఘా మరియు ఢిల్లీ పోలీసుల పక్కా ప్లాన్‌తో ఈ కుట్ర బట్టబయలైంది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల్లో ఉన్న సదరు వింగ్ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకుని, సోషల్ మీడియా వేదికగా ఓ అపరిచిత మహిళ ద్వారా పాకిస్తాన్ గూఢచార హ్యాండ్లర్లు వల విసిరారు. చాటింగ్‌తో మొదలై ఆపై వీడియో కాల్స్‌తో మైకంలోకి దించి అధికారి నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్నారు. రహస్య సమాచారం, ఫొటోల చేరవేత:అధికారి లొంగిపోయాడని నిర్ధారించుకున్నాక.. భారత మిలిటరీ బలగాల మోహరింపు, సైనిక వాహనాలు, విమానాల కదలికల వివరాలతో పాటు కీలక రక్షణ విభాగాల ఫొటోలు, వీడియోలు సేకరించి డిజిటల్ మార్గాల ద్వారా పంపాలని ఆదేశించారు. ఆ మోజులో పడిన వింగ్ కమాండర్ రహస్య పత్రాలను ఆమెకు చేరవేశాడు. కేవలం సమాచారం సేకరించడమే కాకుండా, సదరు అధికారి తోటి సిబ్బంది ఫోన్లలో ఒక ప్రత్యేకమైన యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా ఆదేశించారు. అది సాధారణ యాప్ కాదని, అవతలి వ్యక్తి ఫోన్‌లోని సమాచారాన్ని, లొకేషన్‌ను హ్యాక్ చేసి దొంగిలించే డేంజరస్ ‘స్పైవేర్’ అని విచారణలో తేలింది. సదరు వింగ్ కమాండర్ ప్రవర్తనపై ఆర్మీ ఇంటెలిజెన్స్‌కు ముందే అనుమానం రావడంతో అతని కదలికలు, ఫోన్ కాల్స్‌పై నిరంతర నిఘా ఉంచారు. పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. మే 31 అర్ధరాత్రి వేళ పోలీసులు దాడి చేసి సదరు వింగ్ కమాండర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహంతో సమానమైన ఈ నేరానికి గానూ సదరు అధికారిపై అధికారిక రహస్యాల చట్టంకింద కేసు నమోదు చేశారు.
0 Comments