Ad Code

నేను ఎవరిని కలవాలో, ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెపాల్సిన పనిలేదు : అభిజిత్‌ దీప్కే ఆగ్రహం

త్రపతి శంభాజీనగర్‌లోని వాలుజ్‌ ఎంఐడీసీ ప్రాంతంలోని దీప్కే నివాసం వద్ద ఇటీవల బెదిరింపుల నేపథ్యంలో, అలాగే ఆయనను కలిసేందుకు భారీగా ప్రజలు వస్తుండటంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను అక్కడ నియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చే వారిని నియంత్రిస్తున్నారని దీప్కే ఆరోపించారు. వైరల్‌గా మారిన ఓ వీడియోలో సివిల్‌ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తూ కనిపించారు. తన ఇంటికి ఎవరు రావాలి, ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. "నా ఇంట్లో మీ పెత్తన ఏంటి?. నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెబుతున్నప్పుడు, వారిని ఎందుకు ఆపుతున్నారు? ఢిల్లీ పోలీసుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పటివరకు ఎలాంటి సమస్య జరగలేదు. ఎవరిని కలవాలి.. ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పలేరు" అంటూ దీప్కే ప్రశ్నించారు. "మీరు బయటకు వెళ్లండి. నాకు మీ అవసరం లేదు" అంటూ ఆ పోలీసు అధికారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. మరో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్‌లో మాట్లాడారు. సురేశ్‌ అనే పీఎస్‌ఐ తనను కలిసేందుకు వచ్చే వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని పేర్కొన్నారు. వెంటనే అతడిని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. "నా ఇంటికి వచ్చే వారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది కావాలనే చేస్తున్నారా?" అంటూ ఆయన ప్రశ్నించినట్లు వీడియోలో వినిపిస్తోంది. తన నివాసం సమీపంలో సీఐడీ సిబ్బంది సాధారణ దుస్తుల్లో నిఘా పెట్టారని కూడా దీప్కే ఆరోపించారు. ఓ రిపోర్టర్‌ తనకు ఈ విషయం తెలిపారని చెప్పారు. ఓ సీఐడీ సిబ్బంది ఫోన్‌లో 'హిట్‌ స్ప్రే' పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తున్నారని ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెంటనే రాలేదు. వాలుజ్‌ ఎంఐడీసీ పరిధి డీసీపీ పంకజ్‌ అతుల్కర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు. మరోవైపు.. అభిజిత్‌ యాటిట్యూడ్‌పైనా సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu