హైదరాబాద్‌లోని కార్మిక నగర్‌లో ఆదివారం ఉదయం ఓ మైనర్ బాలుడు అద్దె కారుతో బీభత్సం సృష్టించాడు. 17 ఏళ్ల బాలుడు కారు నడుపుతూ ఒక్కసారిగా అదుపుతప్పడంతో, చర్చికి వెళ్తున్న ఇద్దరు అన్నదమ్ములను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, అక్కడే రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలపైకి కారు దూసుకెళ్లడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి పాదచారుల మీదకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కారు నడుపుతున్న మైనర్ బాలుడిని పట్టుకుని మధురానగర్ పోలీసులకు అప్పగించారు. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని మైనర్లకు అద్దె కార్లు (రెంటల్ కార్స్) ఎలా ఇస్తారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో ఇటీవల మైనర్ల డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారును స్వాధీనం చేసుకుని, బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే, మైనర్‌కు కారును అద్దెకు ఇచ్చిన ఏజెన్సీ లేదా యజమానిని కూడా విచారించి, మోటారు వాహనాల చట్టం కింద వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
0 Comments