Ad Code

ఇండోనేషియా ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న వంతారా

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణి సంరక్షణ సంస్థ వంతారా ఇండోనేషియా ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానిక 'ఫౌనా ల్యాండ్ గ్రూప్' భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ వివరాలను ఇండోనేషియా అటవీ శాఖ మంత్రి రాజా జూలీ ఆంటోనీ జకార్తాలోని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ భాగస్వామ్యం కింద వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. అడవుల్లోని వన్యప్రాణులకు తక్షణ వైద్యం అందించేందుకు 10 సంచార జంతు ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తున్నారు. వే కాంబస్ ప్రాంతంలోని ఏనుగుల ఆసుపత్రిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 'ఎలిఫెంట్ ట్రీట్‌మెంట్ అండ్ కేర్ సెంటర్‌'గా ఆధునీకరిస్తున్నారు. ఇది సంరక్షణలో ఉన్న 62 సుమత్రన్ ఏనుగులతో పాటు, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 100 అడవి ఏనుగులకు సేవలందిస్తుంది. ఏనుగుల సంరక్షకులు, పశువైద్యులు, అటవీ శాఖ అధికారులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 'వన్యప్రాణుల రక్షణ మా ప్రాథమిక బాధ్యత. వంతారా అనుభవం, వనరుల సహకారంతో మా సొంత మౌలిక వసతులను బలోపేతం చేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో ఇండోనేషియా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తాయి' అని రాజా జూలీ ఆంటోనీ తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu