క్యాబ్ బుక్ చేసేటప్పుడే డ్రైవర్‌కి టిప్ ఇస్తారా అని అడిగే ఆప్షన్‌ను తొలగించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహన అగ్రిగేటర్లను ఆదేశించింది. ప్రయాణం పూర్తయిన తర్వాత ప్రయాణికులు డ్రైవర్‌లకు టిప్ ఇవ్వవచ్చు, కానీ ప్రయాణానికి ముందే అదనపు డబ్బు చెల్లించడం ద్వారా క్యాబ్ త్వరగా దొరుకుతుందనే భావన కల్పించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఊబర్, ఓలా లాంటి రైడ్-హెయిలింగ్ యాప్‌ల ద్వారా క్యాబ్‌లు బుక్ చేసుకునే ప్రయాణికులను ఇకపై ప్రయాణం ప్రారంభం కావడానికి ముందే టిప్ చెల్లించమని అడగరు. క్యాబ్ త్వరగా వస్తుందనో లేదా రైడ్ కన్ఫర్మేషన్ త్వరగా జరుగుతుందనో ఆశతో అదనపు చెల్లింపులు చేయమని ప్రయాణికులను ప్రోత్సహించకూడదని తక్షణమే ఈ ఫీచర్లను యాప్‌ల నుంచి తొలగించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. బుకింగ్ సమయంలో రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లు "అడ్వాన్స్ టిప్", "క్యాబ్ త్వరగా పొందడానికి ఈ ఆప్షన్ ఎంచుకోండి" వంటి సందేశాలను చూపుతున్నాయనే నివేదికల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025 లోని క్లాజ్ 14.15 ప్రకారం ప్రయాణికులు స్వచ్ఛందంగా డ్రైవర్‌లకు టిప్ ఇవ్వవచ్చు, కానీ ఈ ఆప్షన్ ప్రయాణం పూర్తయిన తర్వాత మాత్రమే ప్రదర్శించాలి. అలాగే, చెల్లించిన టిప్ మొత్తం నేరుగా డ్రైవర్‌కు మాత్రమే వెళ్లాలి. ఇందులో క్యాబ్ అగ్రిగేటర్ ఎటువంటి కోత విధించడానికి వీల్లేదు.
0 Comments