Ad Code

అద్దెకు అబ్బాయిలు : కొత్త రకం మోసాలకు తెర లేపిన ముఠాలు : పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ హెచ్చరికలు

ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని అమ్మాయిలను, యువతులను లక్ష్యంగా చేసుకుని ముఠాలు కొత్త రకం మోసాలకు తెరతీశాయి. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వేదికల్లో రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్ అంటూ ఆకర్షణీయమైన పోస్టర్లు, ఆఫర్లతో వల విసురుతున్నారు. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నెటిజన్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ సైబర్ నేరగాళ్ల వ్యూహం అత్యంత నయా మోడల్‌లో సాగుతోంది. మీతో కాఫీ డేట్, మూవీ డేట్, షాపింగ్ లేదా ఈవెంట్స్ కోసం అందమైన అబ్బాయిలు అద్దెకు లభిస్తారు అంటూ రకరకాల ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. డిస్కౌంట్లు ఇస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. ఇందుకోసం ప్రొఫైళ్లలో పెట్టే హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలు నిజమైనవి కావు.. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారుచేసినవి లేదా ఇంటర్నెట్ నుంచి దొంగిలించినవి మాత్రమే! ఒక్కసారి ఈ ఆఫర్లను నమ్మి అమ్మాయిలు సంప్రదిస్తే మొదట ఫ్రెండ్లీగా మాట్లాడి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ పేమెంట్స్ పేరిట డిజిటల్ వ్యాలెట్లు లేదా క్యూఆర్ కోడ్‌ల ద్వారా డబ్బులు గుంజుతారు. డబ్బులు అకౌంట్‌లో పడగానే సదరు వ్యక్తులను బ్లాక్ చేసి గాల్లో కలిసిపోతారు. అంతటితో ఈ ముఠాల మోసం ఆగడం లేదు. చాటింగ్ సమయంలో సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా తర్వాత సదరు యువతులను బ్లాక్‌మెయిల్ చేసి సైబర్ ఎక్స్‌టార్షన్‌కు పాల్పడే ప్రమాదం ఉందని కమిషనర్ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కలర్‌ఫుల్‌గా కనిపించే ప్రచారాలను నమ్మి అపరిచితులకు అడ్వాన్స్‌లు చెల్లించవద్దని, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు షేర్ చేయకూడదని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.

Post a Comment

0 Comments

Close Menu