Ad Code

రొమేనియాను పెను విద్యుత్‌ సంక్షోభంలోకి నెట్టిన అసాధారణ ఉష్ణోగ్రతలు

రోపా ఖండాన్ని వణికిస్తున్న తీవ్రమైన వేసవి వడగాలులు, అసాధారణ ఉష్ణోగ్రతలు చివరకు రొమేనియా దేశాన్ని పెను విద్యుత్ సంక్షోభంలోకి నెట్టాయి. దేశంలో ప్రవహించే అత్యంత కీలకమైన డాన్యూబ్ నదిలో నీటి మట్టం గత 30 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో, రొమేనియా తన ఏకైక అణువిద్యుత్ కేంద్రమైన 'చెర్నవోడా'ను పూర్తిగా మూసివేయక తప్పలేదు. ఈ అణు ప్లాంట్ చల్లబడటానికి డాన్యూబ్ నది నీరే ప్రధాన ఆధారం కావడమే దీనికి కారణం. రొమేనియా దేశానికి అవసరమైన మొత్తం విద్యుత్‌లో దాదాపు 20 శాతాన్ని ఈ చెర్నవోడా అణు విద్యుత్ కేంద్రమే అందిస్తుంది. ఇందులో ఒక్కొక్కటి 706 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు రియాక్టర్లు ఉంటాయి. మొదటి రియాక్టర్‌ను జూలైలోనే నిలిపివేసారు. నదిలో నీటి ప్రవాహం మరింత పడిపోవడంతో గురువారం మధ్యాహ్నం రెండో రియాక్టర్‌ను కూడా గ్రిడ్ నుండి తొలగించారు. నదిలో నీటి ప్రవాహాన్ని పెంచేందుకు రాళ్లతో కూడిన పెద్ద పడవలను ముంచి నీటిని మళ్లించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రాబోయే 10 రోజుల్లో ఈ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించే అవకాశం లేదని ప్లాంట్ వర్గాలు తెలిపాయి. పగటిపూట సోలార్, పవన విద్యుత్ కొంతవరకు సహాయపడినప్పటికీ, సాయంత్రం వేళల్లో బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్‌తో పాటు విదేశాల నుండి విద్యుత్‌ను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరోప్‌లో గ్లోబల్ యావరేజ్ కంటే రెట్టింపు వేగంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని 'కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్' హెచ్చరించింది. పొరుగున ఉన్న హంగేరీ దేశంలోని 'ప్యాక్స్' అణువిద్యుత్ కేంద్రం కూడా నీటి మట్టాలు పడిపోవడంతో ముప్పు అంచున ఉంది. ఫ్రాన్స్‌లో వడగాలుల వల్ల దాదాపు 10 బిలియన్ల నుంచి 15 బిలియన్ యూరోల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని అంచనా. ఇటలీ వ్యవసాయ రంగం తీవ్ర కరువు, లండన్ వేసవిలో అత్యధికంగా 38.1°C దాటడం, ఇతర దేశాల అడవుల్లో కార్చిచ్చు రగలడం తీవ్ర కలకలం రేపుతోంది. వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న ఈ పెను మార్పులు యూరోపియన్ యూనియన్ ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం దెబ్బతీసే స్థాయిలో తీవ్ర రూపం దాలుస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu