Ad Code

'వై' ఆకారంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు : వన్‌ వే ఉండేలా హెచ్‌ఎండీఏ డిజైన్లు

హైదరాబాద్‌ మహా నగరంలో అత్యంత ట్రాఫిక్‌ ఉండే కోర్‌ సిటీలో 'వై' ఆకారంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమవుతోంది. నాంపల్లి నుంచి లక్డీకాపూల్‌ వరకు అసెంబ్లీ వెనుక వైపు నుంచి నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. నాంపల్లి వైపు నుంచి లక్డీకాపూల్‌ వైపు వన్‌ వే ఉండేలా 1.450 కిలోమీటర్ల మేర మూడు లేన్లతో ఫ్లైఓవర్‌ను డిజైన్‌ చేస్తున్నారు. నగరంలో నాంపల్లి నుంచి లక్డీకాపూల్‌ వరకు ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా ఉంటుంది. భారీ వాహనాలతో రాత్రి వేళలోనూ అదే పరిస్థితి. ఈ మార్గంలో మూడు సిగ్నల్స్‌ ఉండగా, అందులో ఒకటి ప్రీ లెఫ్ట్‌ ఉంటుంది. సిగ్నల్‌ పడినా, పడకపోయినా అన్ని రోజుల్లోనూ, వేళల్లోనూ ఇక్కడ ట్రాఫిక్‌ ఇబ్బందులుంటాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తే వాహనదారులకు నరకమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్‌ నిర్మించాలని ఖరారు చేసింది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో డీపీఆర్‌ను రూపకల్పన చేస్తున్నారు. నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ముందు నుంచి పబ్లిక్‌ గార్డెన్‌ మీదుగా అసెంబ్లీ వెనుక వైపు నుంచి రైల్వే లైన్‌ వెంట ఫ్లై ఓవర్‌ రానుంది. లక్డీకాపూల్‌ వద్దకు రాగానే ఫ్లై ఓవర్‌ రైల్వే లైన్‌ మీదుగా వెళ్లనుంది. ఈ మార్గం 1.450కిలోమీటర్ల మేర మూడు లేన్లతో వన్‌ వే ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. ఇక్కడే ఫ్లైఓవర్‌ రెండుగా చీలి ఒక మార్గం మాసబ్‌ ట్యాంక్‌ వైపు గల ఫ్లైఓవర్‌కు అనుసంధానంగా రానుంది. దీన్ని రెండు లేన్లతో దాదాపు 400మీటర్ల మేర ఉండేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇక మరో మార్గం ఖైరతాబాద్‌ వైపు రోడ్డుకు అనుసంధానం కానుంది. దీన్ని కూడా రెండు లేన్లతో దాదాపు 530 మీటర్ల మేర ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో వై ఆకారంలో ఉండనుంది. వై ఆకారంలో ఫ్లైఓవర్‌ నగరంలో కొత్తది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ హయాంలో పంజాగుట్టలోనూ నిర్మించారు. అదే తరహాలో నాంపల్లి నుంచి లక్డీక పూల్‌ వరకు డిజైన్‌ చేస్తున్నారు. ట్రాఫిక్‌ అంచనాలపై ఓ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సర్వే చేసినట్లు తెలిసింది. టోపోగ్రఫీ సర్వే తుదిదశలో ఉన్నది. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఏయే ప్రాంతాల్లో ఎన్ని ఫిల్లర్లు నిర్మించాలి? డౌన్‌ ర్యాంపులు, సేకరించాల్సిన ప్రభుత్వ భూములు, రైల్వే అనుమతులు, నిర్మాణ వ్యయం, తదితర అంశాలతో డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను తుదిరూపు చేరినట్లు తెలిసింది. త్వరలో డీపీఆర్‌ను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్‌ఎండీఏ అందజేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu