కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్ అష్మిత చాలిహా మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో చైనాకు చెందిన హాన్ ఖియాన్ క్సీపై 14-21, 21-14, 21-14 తేడాతో విజయం సాధించి, తన తొలి బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్‌ను ముద్దాడింది. 53 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో అస్సాంకు చెందిన అష్మిత, తొలి గేమ్‌లోకాస్త తడబడింది. తొలి గేమ్‌ను చైనా షట్లర్ హాన్ 14-21తో సొంతం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో అష్మిత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. అటాకింగ్ గేమ్‌తో విరుచుకుపడి హాన్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ అస్సాం షట్లర్ సంచలన ప్రదర్శనతో రెండో గేమ్‌ను 21-14తో కైవసం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. మూడో గేమ్‌లో కూడా ఆమె సత్తాచాటింది. ఒక దశలో 9-11తో వెనకబడినప్పటికీ అష్మిత ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. కీలక సమయంలో తిరిగి పుంజుకుని ప్రత్యర్ధిపై 21-14తో తేడాతో విజయం సాధించింది. గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా ఆమె గెలుచుకుంది.
0 Comments