Ad Code

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని పిలుపునిచ్చారు. సైనికుల త్యాగం నుంచి మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, డిజిటల్‌ విప్లవం, పర్యావరణ పరిరక్షణ వరకు అనేక అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఆగస్టు 14ను దేశం 'విభజన విభీషికా స్మృతి దినం'గా పాటిస్తోందని రాష్ట్రపతి గుర్తుచేశారు. స్వాతంత్ర్య సమయంలో జరిగిన మతపరమైన హింస కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇళ్లు వదిలి శరణార్థులుగా మారారని తెలిపారు. ఆ బాధను ఎదుర్కొన్నప్పటికీ వారు ధైర్యం, గుర్తింపును కోల్పోలేదని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో 550కుపైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం మరో భారీ సవాలుగా ఉందని, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చొరవతో ఆ ప్రక్రియ విజయవంతమైందని గుర్తుచేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యం చూపిన ధైర్యాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. 'ఆపరేషన్ సిందూర్' దేశ రక్షణ సామర్థ్యానికి ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు. అలాగే నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు మారుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్నాయని తెలిపారు. గత దశాబ్దానికి పైగా భారత్‌ సమ్మిళిత అభివృద్ధిలో వేగంగా ముందుకు సాగిందని రాష్ట్రపతి అన్నారు. 25 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడినట్లు తెలిపారు. ప్రధానమంత్రి జనధన్‌ యోజన ద్వారా సుమారు 59 కోట్ల మంది బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చారని, వారిలో 32 కోట్లకుపైగా మహిళలు ఉన్నారని వివరించారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ అందిస్తూ ఆహార భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా 60 కోట్ల మందికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందుతోందని చెప్పారు. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న సుమారు 6 కోట్ల మంది వృద్ధులకు కూడా ఈ ఆరోగ్య భద్రత అందుతున్నట్లు పేర్కొన్నారు. రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో పాటు డెయిరీ, పౌల్ట్రీ, మత్స్య, తేనెటీగల పెంపకం వంటి రంగాల్లోనూ సహాయం అందుతోందన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలతో స్థానిక సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపుతోందని రాష్ట్రపతి ప్రశంసించారు. మహిళలు డ్రోన్‌ దీదీల నుంచి వైమానిక దళ ఫైటర్‌ పైలట్ల వరకు వివిధ రంగాల్లో ముందుకు వస్తున్నారని తెలిపారు. మూడు కోట్ల 'లఖ్‌పతి దీదీ'ల లక్ష్యం ఇప్పటికే చేరుకోగా, మరో మూడు కోట్ల మహిళలను ఆ స్థాయికి తీసుకెళ్లడమే తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు. భారత్‌లో ప్రపంచ స్థాయి డిజిటల్‌ మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయని రాష్ట్రపతి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న దుకాణాలు, వీధి వ్యాపారులు సైతం డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారని, ప్రపంచ రియల్‌టైమ్‌ డిజిటల్‌ లావాదేవీల్లో సగానికి పైగా భారత్‌లోనే జరుగుతున్నాయని తెలిపారు. హైవేలు, రైల్వేలు, జలమార్గాలు, విమాన మార్గాల నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. దీని ద్వారా పెట్టుబడులు, వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 'ఆత్మనిర్భర్‌ భారత్‌' దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందన్నారు. భవిష్యత్‌ తరాలకు సహజ వనరులపై సమాన హక్కు ఉందని రాష్ట్రపతి గుర్తుచేశారు. 'ఏక్‌ పెడ్‌ మా కే నామ్', 'LiFE' వంటి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే, సర్దార్‌ పటేల్‌ వంటి మహనీయుల సేవలను రాష్ట్రపతి స్మరించారు. ముఖ్యంగా జ్యోతిబా ఫులే 200వ జయంతి సందర్భంగా సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ఆయన చేసిన కృషిని గుర్తుచేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వైద్యులు, కార్మికులు, రైతులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, విదేశాల్లోని భారతీయులు.. ఇలా ప్రతి ఒక్కరి కృషి దేశ నిర్మాణంలో కీలకమని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడం మాత్రమే కాకుండా, ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరేలా చేయడమే 'అంత్యోదయ' లక్ష్యమని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu