డిజిటల్ చెల్లింపుల లావాదేవీలపై ఛార్జీలు విధించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం, రూ.2,000కు మించిన వ్యాపార చెల్లింపులపై 0.25% నుంచి 0.4% వరకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మార్పును పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఈ ఛార్జీలు వ్యాపారులకు చేసే చెల్లింపులకే వర్తించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా ఇతర వ్యక్తులకు యూపీఐ ద్వారా డబ్బు పంపితే ఎలాంటి ఎండీఆర్ ఉండదు. ఈ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయంలో మాత్రం ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ అంచనాల ప్రకారం, రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలు మొత్తం లావాదేవీలలో సుమారు 95 శాతం ఉంటాయి. అందువల్ల ఎక్కువ మంది రోజువారీ వినియోగదారులపై ఈ మార్పు ప్రభావం ఉండదని అధికారులు చెబుతున్నారు. పాలు, కూరగాయలు, కిరాణా సరుకులు కొనడం, ఆటో లేదా టాక్సీ చెల్లింపులు వంటి సాధారణ లావాదేవీలు ఎక్కువగా రూ.2,000లోపే ఉంటాయి. అందుకే సాధారణ ప్రజలకు అదనపు భారం పడే అవకాశం చాలా తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే విలువ పరంగా చూస్తే, రూ.2,000కు పైబడిన లావాదేవీలు మొత్తం యూపీఐ చెల్లింపుల విలువలో సుమారు 65 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జూలై నెలలో మాత్రమే 23.7 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.29.9 లక్షల కోట్లుగా నమోదైంది. ఎండీఆర్ అమలులోకి వచ్చినా ప్రతి వ్యాపారి ఆ ఛార్జీని వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది వ్యాపారులు ఆ స్వల్ప ఖర్చును తామే భరించే అవకాశం ఉందని చెబుతున్నారు. పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం ఎండీఆర్ మొత్తానికి గరిష్ఠ పరిమితి కూడా నిర్ణయించే అవకాశం ఉంది. ఎందుకంటే యూపీఐ చెల్లింపుల్లో క్రెడిట్ కార్డుల మాదిరిగా రుణ సౌకర్యం ఉండదు కాబట్టి, ఖర్చులు తిరిగి వచ్చేంత వరకు మాత్రమే ఛార్జీలు ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై ఎమ్మార్డీ అమల్లో ఉంది. క్రెడిట్ కార్డుల విషయంలో ఈ ఛార్జీ కొన్ని సందర్భాల్లో 3 శాతం వరకు ఉండొచ్చు. డెబిట్ కార్డుల ద్వారా రూ.20 లక్షల వరకు జరిగే లావాదేవీలపై గరిష్ఠంగా 0.4 శాతం, అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై 0.9 శాతం వరకు ఎమ్మార్డీ వర్తిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో పెద్ద మొత్తంలో జరిగే యూపీఐ వ్యాపార చెల్లింపులపై కూడా స్వల్ప ఎమ్మార్డీ తీసుకురావాలా అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
0 Comments