ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 17వ 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్' అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.భారతీయ సినిమా వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో ఈ ఏడాది కూడా పలు భాషలకు చెందిన చిత్రాలు, నటీనటులు, దర్శకులు అవార్డులు అందుకున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'కాంతార: ఏ లెజెండ్ - చాప్టర్ 1' చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కింది. ఈ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్న రిషబ్ శెట్టికి సినీ రంగంలో ఆయన చూపించిన నాయకత్వానికి గుర్తింపుగా 'లీడర్‌షిప్ ఇన్ సినిమా' అవార్డును కూడా అందించారు. దీంతో ఒకే వేడుకలో రిషబ్ శెట్టి రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా అవార్డు అందుకున్నారు. 'కాంత' చిత్రంలో తన నటనకు ఆయన ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. మరోవైపు 'ఫుల్ ప్లేట్' సినిమాలో నటనకు కీర్తి కుల్హరి ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'లోక చాప్టర్ 1: చంద్ర' ఎంపికైంది. 'ద గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ'కి ఉత్తమ చిత్రం విభాగంలో స్పెషల్ మెన్షన్ లభించింది. ఇండీ విభాగంలో రీమా దాస్ తెరకెక్కించిన 'నాట్ ఏ హీరో' ఉత్తమ ఇండీ ఫిల్మ్‌గా నిలిచింది. 'ఫ్లవర్స్ ఆఫ్ అకాసియా'కు ఇండీ విభాగంలో స్పెషల్ మెన్షన్ దక్కింది. డాక్యుమెంటరీ విభాగంలో 'ఫ్లయింగ్ టైగర్స్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ప్రేక్షకుల నుంచి అత్యధిక ఆదరణ పొందిన చిత్రంగా 'సైయారా'కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు లభించింది. సమానత్వాన్ని ప్రోత్సహించే కథను అందించిన 'సితారే జమీన్ పర్'కు ఈక్వాలిటీ ఇన్ సినిమా అవార్డు దక్కింది. ఇదే విభాగంలో సిమ్రాన్ మంగేష్కర్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. వెబ్ సిరీస్ విభాగంలోనూ పలువురు నటీనటులు అవార్డులు అందుకున్నారు. 'మట్కా కింగ్'లో నటనకు విజయ్ వర్మ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకోగా.. 'దిల్లీ క్రైమ్ 3'లో నటనకు రసికా దుగల్ ఉత్తమ నటిగా నిలిచారు. 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' సీజన్ 2కు ఉత్తమ సిరీస్ పురస్కారం లభించింది. ఇక భారతీయ సినిమా దిగ్గజాలకు ఈ వేడుకలో ప్రత్యేక గౌరవం లభించింది. లెజెండరీ నటి రేఖను 'ఎక్స్‌లెన్స్ ఇన్ సినిమా' అవార్డుతో సత్కరించారు. సినీ రంగంలో దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన రేఖకు ఈ ప్రత్యేక పురస్కారం అందించడం అభిమానులను ఆనందపరిచింది. బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ సినీ పరిశ్రమలో 30 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు అందించారు. నటుడు పంకజ్ త్రిపాఠికి 'ఆర్టిస్ట్ ఆఫ్ డిస్టింక్షన్' అవార్డు లభించింది. షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్ట్రేలియా నుంచి 'ద వెయిట్ ఆఫ్ సాయిల్', ఇండియా నుంచి 'జోస్ టర్న్' ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. 'లాలా అండ్ పాప్పీ'కి రెయిన్‌బో స్టోరీటెల్లర్ అవార్డు దక్కింది. సబ్‌కాంటినెంట్ విభాగంలో 'నో గుడ్ మెన్' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.
0 Comments