ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికి మళ్లీ ఊపు అందుకుంది. విజయవాడ నగర శివార్లతో పాటు గుంటూరు జిల్లా పరిధిలోని కీలక ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు గణనీయంగా పుంజుకున్నాయి. విజయవాడ పరిసరాలైన కానూరు, పటమట , రాజధానికి సరిహద్దుగా ఉన్న తాడేపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గత త్రైమాసికంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే రాబడి దాదాపు 15 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కానూరు, పడమట ప్రాంతాలు విజయవాడ నగర ప్రధాన వాణిజ్య , నివాస కేంద్రాలకు అత్యంత చేరువగా ఉండటంతో ఇక్కడ ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు గృహ యజమానులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. గత కొద్ది నెలలుగా మందకొడిగా సాగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఒక్కసారిగా వేగం పుంజుకోవడంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు మళ్లీ కొనుగోలుదారులతో సందడిగా మారుతున్నాయి. వాణిజ్య వర్గాలు, ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణమవుతున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని తాడేపల్లి ప్రాంతంలో భూములు, అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో ఉండటం, అమరావతి కనెక్టివిటీ రోడ్ల విస్తరణ జరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు శ్రద్ధ చూపిస్తున్నారు. తాడేపల్లి, కుంచనపల్లి, వడ్డేశ్వరం పరిసర ప్రాంతాల్లో కొత్తగా ప్రారంభమవుతున్న ప్రాజెక్టుల సంఖ్య పెరగడం కూడా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి దోహదపడింది. విజయవాడ-తాడేపల్లి బెల్ట్‌లో ఆస్తి రిజిస్ట్రేషన్ల వృద్ధి కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, అమరావతి కారిడార్ అంతటా రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోసింది. రాబోయే పండుగల సీజన్‌లో ఈ లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని, భూముల విలువల పెరుగుదలతో పాటు ప్రభుత్వ ఖజానాకు కూడా ఆదాయం గణనీయంగా పెరుగుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు.
0 Comments