పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని ఎట్టకేలకు స్వదేశానికి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు బ్రిటన్ కోర్టుల్లో సాగిన సుదీర్ఘ న్యాయపోరాటంలో ఆయనకు అన్ని దారులూ మూసుకుపోయాయి. తన అప్పగింతను అడ్డుకోవాలంటూ బ్రిటన్ న్యాయస్థానాల్లో ఆయన వేసిన అన్ని పిటిషన్లు వీగిపోయాయి. యూకే కోర్టులలో చుక్కెదురు కావడంతో నీరవ్ మోడీఆఖరి ప్రయత్నంగా 'యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్' ను ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా ఆయనకు ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో భారత్‌కు రప్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఆయనను భారత అధికారులకు అప్పగించేందుకు అవసరమైన అధికారిక చర్యలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం వెలుగుచూసిన ఈ భారీ రుణ మోసం, మనీలాండరింగ్ కేసులపై సీబీఐ, ఈడీ సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నాయి. 2019 మార్చి నుంచి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులోనే మగ్గుతున్న నీరవ్ మోడీని భారత న్యాయస్థానాల ముందు నిలబెట్టాలన్న కేంద్ర దర్యాప్తు సంస్థల సుదీర్ఘ నిరీక్షణకు, ప్రయత్నాలకు త్వరలోనే తుది ఫలితం దక్కనుంది.
0 Comments