రైళ్లల్లో ప్రయాణ సమయంలో అందించే ఏసీ కోచ్ బెడ్‌రోల్స్, దుప్పట్లు, టవల్స్ పెద్ద ఎత్తున చోరీకి గురవుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 1.27 కోట్ల బెడ్‌రోల్స్ చోరీకి గురైనట్లు రైల్వే అధికారులు గుర్తించారు. వీటి వల్ల రైల్వే కాంట్రాక్టర్లకు దాదాపు రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ప్రతి ఏసీ కోచ్‌లో ప్రయాణించే వెయ్యి మంది ప్రయాణికులలో కనీసం ఒకరు ఈ చోరీకి పాల్పడుతున్నారు. ప్రయాణ సమయంలో రైల్వే సిబ్బంది తమకు అందజేసిన సామాగ్రిని సొంతం చేసుకుంటున్నారు. ఆర్టీఐ ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న 16 రైల్వే జోన్లలోని 54 డివిజన్ల డేటా ఆధారంగా ఈ విషయాలు స్పష్టం అయ్యాయి. జనవరి 2022 నుండి ఈ ఏడాది మే మధ్య కాలంలో నిరంతరం ఈ తరహా చోరీలో పెరుగుతూనే వస్తోన్నాయి. దీనిపై ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 2022తో పోలిస్తే 2025 నాటికి ఈ తరహా దొంగతనాలు ఏకంగా 56 శాతం పెరిగాయి. చోరీకి గురైన వస్తువుల్లో ఫేస్ టవల్స్ ఎక్కువగా ఉంటోన్నాయి. బ్యాగుల్లో ఇమిడిపోయే వీలుండటం వల్ల ఇవే ఎక్కువగా చోరీకి గురయ్యాయి. గత నాలుగేళ్లలో అత్యధికంగా 46.54 లక్షల ఫేస్ టవల్స్ మాయం అయ్యాయి. వీటితో పాటు 41.13 లక్షల బెడ్‌షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల బ్లాంకెట్లను ప్రయాణికులు తమ ఇళ్లకు పట్టుకెళ్లారు. పరిమాణంలో పెద్దగా ఉండి, బ్యాగులో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించే దిండ్లు మాత్రం కేవలం 2.76 లక్షలు మాత్రమే పోయాయి. నిబంధనల ప్రకారం కోచ్‌లలో బెడ్‌రోల్ సరఫరా చేసే బాధ్యతను రైల్వే శాఖ ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగిస్తుంది. బెడ్‌రోల్స్ లెక్క తగ్గితే.. ఆ నష్టాన్ని సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీలే భరించాల్సి ఉంటుంది. ఈ కొరతను తీర్చడానికి ఏజెన్సీలు బెడ్‌రోల్ సెట్లను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నారని ఆర్టీఐలో తేలింది. ఈ చోరీల్లో రాజస్థాన్ పరిధిలోని బికానీర్ డివిజన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 25.76 లక్షల వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో జార్ఖండ్‌కు చెందిన రాంచీ డివిజన్ దాదాపు 9.31 లక్షల వస్తువుల నష్టంతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ డివిజన్ లో 8.21 లక్షలు, ముంబై- 8.17 లక్షలు, జోధ్‌పూర్- 8.09 లక్షలు, అహ్మదాబాద్- 6.94 లక్షల వస్తువులు చోరీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
0 Comments