కొత్త ఢిల్లీలోని జగత్‌పురి ప్రాంతంలో తన అక్రమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో కట్టుకున్న భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. ఏడు నెలల క్రితం ముస్తకీమ్ అనే వ్యక్తికి అలీషా (20) అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుండి వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సంఘటన జరిగిన రోజు రాత్రి, ముస్తకీమ్ నిద్రిస్తున్న సమయంలోనే మరణించాడని అలీషా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. బంధువులు వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా, ముస్తకీమ్ అప్పటికే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. అయితే, మరణంలో అనుమానాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ సమయంలో అలీషా ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది. పెళ్లికి ముందే అలీషాకు మరొక వ్యక్తితో ప్రేమాయణం ఉండేది. ఆమె తల్లిదండ్రులు ఆ ప్రేమను వ్యతిరేకించి, ముస్తకీమ్‌తో వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత కూడా భర్తతో కలిసి జీవించడానికి అలీషా ఇష్టపడలేదు. తన పాత ప్రేమికుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఆమె ప్రేమకు ముస్తకీమ్ అడ్డుగా మారుతున్నాడని గ్రహించిన అలీషా, అతడిని చంపాలని నిర్ణయించుకుంది. సుమారు నాలుగు నెలల క్రితమే ముస్తకీమ్‌ను హత్య చేయడానికి ఆమె ప్రయత్నించింది, కానీ అప్పుడు అతను తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. కానీ ఈసారి తన ప్లాన్‌ను అమలు చేసి భర్తను హత్య చేసింది. ఈ నిజాలు తెలుసుకున్న పోలీసులు అలీషాను అరెస్టు చేసి జైలుకు తరలించారు.