ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ భీమ్‌రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి, దాదాపు రూ. 300 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ సోదాల సమయంలో భీమ్‌రెడ్డికి కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయడం, అరెస్ట్ చేయకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఏసీబీ అధికారులు స్పందిస్తూ.. సోదాల సమయంలో భీమ్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండటం వల్లే అప్పట్లో అరెస్ట్ చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఒత్తిడి , విమర్శలు రావడంతో అధికారులు తాజాగా భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమాస్తుల విచారణను మరింత వేగవంతం చేసిన అధికారులు, ఆయనను కాసేపట్లో నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు భీమ్‌రెడ్డిని ఏసీబీ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
0 Comments