కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న ఈపీఎఫ్ -1952, ఈపీఎస్ -1995, ఈడీఎల్ఐ -1976 పథకాల స్థానంలో వరుసగా భవిష్య నిధి-2026, ఉద్యోగుల పింఛన్ పథకం-2026, ఉద్యోగుల డిపాజిట్ బీమా పథకం-2026లను తీసుకొస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త మార్పుల వల్ల పీఎఫ్ విత్ డ్రా విధానాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, పీఎఫ్ ఖాతాదారులు ఒక సంవత్సరంలో గరిష్టంగా రెండు సార్లు మాత్రమే పాక్షిక విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో అనారోగ్య కారణాల రీత్యా వైద్య ఖర్చుల కోసం ఎన్నిసార్లయినా విత్ డ్రా చేసుకునే వీలుండేది, కానీ ఇప్పుడు ఆ నిబంధన మారింది. అదనంగా, ఉద్యోగి తన మొత్తం సర్వీస్ కాలంలో కేవలం ఒక సంవత్సరం పాటు పీఎఫ్ కంట్రిబుషన్ పూర్తి చేసిన తర్వాతే ఈ పాక్షిక ఉపసంహరణకు అర్హత సాధిస్తారు. పిల్లల లేదా స్వయం విద్యా అవసరాల కోసం ఉద్యోగి తన మొత్తం సర్వీస్ కాలంలో గరిష్టంగా 10 సార్లు నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే, గతంలో ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా హోం లోన్ తిరిగి చెల్లించడానికి కేవలం రెండు సార్లు మాత్రమే పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పరిమితిని ఐదు సార్లకు పెంచింది. అంటే, సర్వీస్ మొత్తంలో ఇళ్ల అవసరాల కోసం ఐదుసార్లు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో మెయింటెన్ చేయాల్సిన కనీస నిల్వకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఖాతాలో కనీస నిల్వను 25 శాతంగా కొనసాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, అర్హులైన చందాదారులు అత్యవసర సమయాల్లో తమ పీఎఫ్ బ్యాలెన్స్ నుండి గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంది. సాంకేతికతను జోడించి ఈపీఎఫ్ఓ సేవలను మరింత సులభతరం చేసేందుకు ‘ఈపీఎఫ్ఓ 3.0’ను తీసుకువస్తున్నారు. దీని ద్వారా చందాదారులు త్వరలోనే యూపీఐ యాప్‌లు, మరియు ఈపీఎఫ్-లింక్డ్ ఏటీఎం కార్డుల ద్వారా నేరుగా తమ ప్రావిడెంట్ ఫండ్ పొదుపు మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ లో యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తే బ్యాలెన్స్ తెలుసుకోవడం కూడా చాలా సులువవుతుంది.
0 Comments