నేపాల్‌లో వెంటాడి చంపిన ధ్రుబే ఏనుగు : మైళ్ల దూరమొచ్చినా వదలని ఏనుగు

నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో నివసించే శనిచర బోటే కుటుంబానికి ‘ధ్రుబే’ అనే ఏనుగు రూపంలో పెద్ద విపత్తు ఎదురైంది. 2012 డిసెంబర్‌లో మాడి అనే పట్టణంలో ధ్రుబే ఏనుగు దాడి చేయడంతో శనిచర తల్లిదండ్రులు మరణించారు. ఈ భయంకరమైన ఘటనతో దిగ్భ్రాంతికి గురైన శనిచర, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాప్తి నది దాటి దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్‌పూర్‌కు వలస వెళ్లాడు. ఇంత దూరం వస్తే ఆ ఏనుగు నుంచి ముప్పు తప్పుతుందని భావించాడు. అయితే విధి ఆడిన వింత నాటకంలో శనిచర నమ్మకం అపోహగానే మిగిలింది. ఇటీవల జగత్పూర్ లోని శనిచర కుటుంబం నివసిస్తున్న ప్రాంతానికి ధుర్బే ఏనుగు చేరుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ ఏనుగు దాడిలో శనిచర కోడలు అశికా బోటే (25), నాలుగేళ్ల మనవడు భారత్ బోటే మృతి చెందారు. "పెద్ద నదులు దాటి వెళ్లినా మేము సురక్షితంగా ఉంటామని అనుకున్నాం. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా అదే ఏనుగు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మా ఇంటిపై దాడి చేసి నా కోడలు, చిన్న మనవడిని తీసుకెళ్లిపోయింది. ఇక మాకు పారిపోవడానికి చోటు లేదు” అని శనిచర బోటే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ధుర్బే ఏనుగు కారణంగా ఒకే కుటుంబంలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. 2012లో శనిచర తల్లిదండ్రులను బలిగొన్న ఇదే ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత ఆయన కోడలు, మనవడిని కూడా పొట్టన పెట్టుకుంది. ధ్రుబే ఏనుగు నేపాల్‌లోనే అత్యంత ప్రమాదకరమైన ఒంటరి ఏనుగుగా పేరుగాంచింది. 2010 నుంచి ఇప్పటివరకు ఈ ఒక్క ఏనుగే రికార్డు స్థాయిలో 25 మందిని పొట్టనబెట్టుకుందని చిత్వాన్ నేషనల్ పార్క్ ప్రతినిధి అభినాష్ థాపా మగర్ ధ్రువీకరించారు. జగత్‌పూర్ తాజా ఘటనే దీనికి చివరి ఉదాహరణ. దీని భయానక చరిత్ర కారణంగానే ఈ ఏనుగు పేరు మీద ప్రత్యేకంగా ఒక వికీపీడియా పేజీ కూడా ఉండటం గమనార్హం. అటవీ అధికారులు 2016 నుంచి ధ్రుబే కదలికలను పర్యవేక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీని కోసం దానికి శాటిలైట్ ట్రాకింగ్ (రేడియో) కాలర్ కూడా అమర్చారు. 2020, 2023లలో ఈ కాలర్‌ను మార్చినప్పటికీ, దాని దాడులను పూర్తిగా అడ్డుకోవడంలో అటవీ శాఖ విఫలమైంది. అడవులు తగ్గిపోవడం, వన్యప్రాణుల ఆవాసాల్లోకి మానవ నివాసాలు విస్తరించడమే ఇలాంటి ఘోరాలకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org