మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కర్ణత్ తాలూకా పరిధిలోని జలాల్ పూర్ గ్రామానికి చెందిన నీట్ విద్యార్థిని అంకితా సంగ్లే ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆషాడ ఏకాదశి సందర్భంగా అంకిత తల్లిదండ్రులు, అన్నయ్య పండర్‌పూర్‌కు వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో సమీప బంధువులు వచ్చి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో అంకిత రాసిన సూసైడ్ నోట్ లభించింది. నీట్ రీ-ఎగ్జామ్‌లో ఆమెకు 166 మార్కులు రాగా, కటాఫ్ మార్కులు 177గా ఉన్నాయి. కేవలం 11 మార్కుల తేడాతో కటాఫ్ కోల్పోవడంతో, డాక్టర్ కావాలన్న తన కల నెరవేరలేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. లేఖలో "అమ్మా నాన్నా మీరు నా కోసం ఎంతో కష్టపడ్డారు, కానీ మీ కలను నెరవేర్చలేకపోతున్నా. అన్నయ్య, అమ్మా నాన్నను జాగ్రత్తగా చూసుకో. నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి" అని భావోద్వేగంగా రాసుకొచ్చింది. తాను ఒక సగటు విద్యార్థిని మాత్రమేనని, కుటుంబం అంచనాలను అందుకోలేకపోయానని పేర్కొంటూ, తన చావుకు ఎవరినీ నిందించవద్దని కోరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments