Ad Code

ఎఫ్‌డీఏ తనిఖీలు : పాలను మురుగు కాలువల్లో పారబోసిన పాల డెయిరీ నిర్వాహకులు : వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌

హారాష్ట్రలోని సతారా జిల్లా మాన్ తాలూకాలో ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారనే ప్రచారం కలకలం రేపింది. దీంతో భయాందోళనకు గురైన కొందరు పాల డెయిరీ నిర్వాహకులు వందల లీటర్ల పాలను రోడ్లపై, మురుగు కాలువల్లో పారబోశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తుకారాం ముండే ఆహార కల్తీ, నాణ్యత లోపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం మాన్ తాలూకాలోని గ్రామాల్లో యథావిధిగా పాల సేకరణ కొనసాగుతోంది. అయితే, మధ్యాహ్నం సమయంలో ఎఫ్‌డీఏ అధికారులు పాల డెయిరీలు, పాల సేకరణ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారనే ప్రచారం వేగంగా వ్యాపించింది. పాల నమూనాలను పరీక్షించి లోపాలు తేలితే కఠిన చర్యలు తీసుకుంటారనే భయంతో కొందరు పాల డెయిరీ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే పాల సేకరణ వాహనంలో ఉన్న వందల లీటర్ల పాలను రోడ్డు పక్కన, సమీపంలోని మురుగు కాలువలో పారబోశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్లపై పాల ప్రవాహం కనిపించిన దృశ్యాలు చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనతో పాల నాణ్యతపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాలను ఎందుకు పారబోశారు? పాలలో ఏవైనా నాణ్యత సమస్యలు ఉన్నాయా? పాల సేకరణ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలను వెల్లడించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మహారాష్ట్రలో ఆహార కల్తీపై ఎఫ్‌డీఏ నిఘా మరింత కఠినతరం చేసిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పాల భద్రత, నాణ్యతపై ప్రజల్లో ఆందోళనలను మరింత పెంచింది.

Post a Comment

0 Comments

Close Menu