జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లాలో ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లోకి అర్ధరాత్రి వేళ అత్యంత విషపూరితమైన కట్లపాము చొరబడి గాఢ నిద్రలో ఉన్న నలుగురు విద్యార్థినులను కాటు వేయడంతో, 13 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి అత్యంత విషమంగా మారింది. విద్యార్థినుల అరుపులు విన్న హాస్టల్ ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే గదికి చేరుకుని తీవ్ర భయాందోళనల నడుమ నలుగురు విద్యార్థినులను రాత్రికి రాత్రే లోహర్దగా సదర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే మార్గంలోనే విషం శరీరామంతటా పాకడంతో మొదట కాటుకు గురైన వర్ష ఓరాన్ (13) అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మిగిలిన ముగ్గురు విద్యార్థినుల్లో ఫుల్మనియా ఓరాన్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం ఆమెను రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మిగతా ఇద్దరు విద్యార్థినులు లోహర్దగా సదర్ ఆసుపత్రిలోనే అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.
0 Comments