Ad Code

హనీట్రాప్‏లో చిక్కుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ : రూ.9.29 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ లో వాట్సప్‌ వీడియోకాల్‌ ద్వారా హనీట్రాప్‏లో చిక్కుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.9,29,857 వసూలు చేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగు చూసింది. దీనిపై సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం నార్సింగిలోని రాజపుష్ప ప్రొవిన్షియాలో నివాసం ఉంటున్న 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున గుర్తుతెలియని ఓ మహిళ నుంచి వాట్సప్‌ వీడియో కాల్‌ వచ్చింది. ఆమె నగ్నంగా ఉండి, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ యువకుడినీ అలాగే చేయాలని ప్రేరేపించింది. కాల్‌ ముగిసిన కొద్దిసేపటికే అదే నంబరు నుంచి మరో కాల్‌ వచ్చింది. ఈసారి ఓ పురుషుడు హిందీలో మాట్లాడుతూ బాధితుడి వీడియోను ఎడిట్‌ చేసి చూపించాడు. ఆ వీడియోను కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపిస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేశాడు. బాధితుడి సోదరి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు వీడియో పంపినట్లు స్క్రీన్‌షాట్‌ పెట్టాడు. దీంతో ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వారికి తొలుత రూ.82 వేలు, తర్వాత రూ.1.40 లక్షలు, మరోసారి రూ.2.60 లక్షలు పంపించాడు. ఆ తర్వాత కూడా బెదిరింపులు కొనసాగటంతో డబ్బులు పంపించాడు. మొత్తంగా రూ.9 లక్షలకుపైగా పోగొట్టుకున్నాడు. చివరికి ధైర్యం తెచ్చుకొని జాతీయ సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఒక నిందితుడి బ్యాంకు ఖాతాను అధికారులు బ్లాక్‌ చేశారు.

Post a Comment

0 Comments

Close Menu