ఢిల్లీలోని జంతర్ మంతర్ విద్యార్థుల నిరసనలతోనే కాకుండా మరో విధంగా వార్తల్లో నిలిచింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ సంస్థలు స్విగ్గీ, జెప్టో, జొమాటో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ తమ యాప్‌లలో జంతర్ మంతర్ ప్రొటెస్ట్ సైట్ పేరుతో ప్రత్యేక డెలివరీ లొకేషన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం నీట్ పేపర్ లీక్ ఆరోపణల విషయంలో విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వారికి తాగునీరు, ఆహారం, బిస్కెట్లు, స్నాక్స్, మందులు, బ్యాండేజ్‌లు వంటి అత్యవసర వస్తువుల కోసం భారీగా ఈ క్విక్ కామర్స్ సంస్థలకు ఆర్డర్లు వస్తున్నాయని నివేదికలు వెల్లడించాయి. క్విక్ కామర్స్ కంపెనీల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సోమవారం నుంచి జంతర్ మంతర్ ప్రాంతంలో రోజువారీ ఆర్డర్ల సంఖ్య, ఆర్డర్ విలువలు 70-80 శాతం వరకు పెరిగాయి. నిరసనలకు పలువురు ప్రముఖులు మద్దతు తెలపడంతో అక్కడికి వచ్చే వారి సంఖ్య కూడా పెరిగిందని తెలిసింది. రాత్రి వేళల్లో కూడా ఆర్డర్లు ఆగడం లేదని, తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా డెలివరీలు కొనసాగుతున్నాయని సంస్థలు తెలిపాయి. పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్ సహా ప్యాకేజ్డ్ వాటర్, శీతర పానీయాలు, స్నాక్స్ తయారీ సంస్థలు ఢిల్లీ కనాట్ ప్లేస్ పరిసరాల్లోని తమ స్టోర్లకు అదనపు సరుకును పంపుతున్నాయి. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు కంపెనీలు తెలిపాయి. సోషల్ మీడియాలో వైరల్ పోస్టుల ప్రకారం ఢిల్లీలోని కొన్ని బ్లూ టోకై, డొమినోస్ అవుట్ లెట్లు నిరసనల సమయంలో విద్యార్థులకు తాత్కాలిక ఫస్ట్ ఎయిడ్ సెంటర్లుగా ఉపయోగపడ్డాయి. టియర్ గ్యాస్ ఘటనల సమయంలో గాయపడిన వారికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే స్విగ్గీ, జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్ అర్ధరాత్రి వరకు విద్యార్థులకు ఆహారం అందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంకా కొన్ని క్యాబ్ సేవల సంస్థలు కూడా విద్యార్థుల్ని ఉచితంగా తరలించాయని సమాచారం. జంతర్ మంతర్ ఇప్పుడు ఒక నిరసన ప్రదేశంగా మాత్రమే కాకుండా, అత్యవసర అవసరాల కోసం ఫుడ్, మెడికల్ డెలివరీల కేంద్రంగా కూడా మారడం చర్చనీయాంశంగా మారింది. నిరసనల సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థలు బహిరంగ ప్రకటనల కంటే అవసరమైన వస్తువుల సరఫరాపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
0 Comments