Ad Code

భారీగా పెరగనున్న యాపిల్ ఉత్పత్తుల ధరలు

మెమొరీ చిప్స్ ధరలు పెరగడంతో యాపిల్ ఉత్పత్తుల ధరల పెంపుపై యోచిస్తున్నట్లు యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. త్వరలో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్న టిమ్ కుక్ 'వాల్ స్ట్రీట్ జర్నల్'తో మాట్లాడుతూ, మెమొరీ చిప్స్ సంక్షోభం మరింత క్లిష్టంగా మారడంతో ధరల పెంపు తప్పడం లేదని పేర్కొన్నారు. అయితే, ఏయే ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే విషయాలను ఆయన వెల్లడించలేదు. దీంతో, ఈ సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశమున్న ఐఫోన్ 18 ధర కూడా పెరుగుతుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. స్మార్ట్‌ఫోన్ల తయారీలో మెమొరీ చిప్స్ అత్యంత కీలకమైనవి. అయితే, ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి డిమాండ్ భారీగా పెరగడంతో ఈ చిప్స్ ధరలు అమాంతం పెరిగాయి. కంపెనీపై పడుతున్న ఈ అదనపు భారాన్ని వినియోగదారులపై వేయకుండా ఉండటానికి అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నాం. కానీ, పరిస్థితి ఇక కొనసాగించలేని స్థాయికి చేరిందని టిమ్ కుక్ 'వాల్ స్ట్రీట్ జర్నల్'తో చెప్పారు. ఒకవైపు మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు చిప్స్ సరఫరా తగ్గింది. ఇదే తరుణంలో చిప్స్ తయారీ సంస్థలు రేట్లను పెంచేస్తున్నాయని  ఆయన అన్నారు. యాపిల్‌లో 15 ఏళ్ల ప్రస్థానం తర్వాత ఈ సెప్టెంబర్‌లో టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu