తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ మత్స్యకారులకు సమాన అవకాశాలు కల్పించడం, అక్రమాలను అరికట్టడం లక్ష్యంగా చేపల విక్రయాల కోసం ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఫిషరీస్ ఫెడరేషన్ బుకింగ్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేయడంతో ఇకపై బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా, పారదర్శకంగా సాగనుంది. ముఖ్యంగా స్పాట్ ట్రేడర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ కొత్త విధానం ఉపయోగపడనుంది. ఈ క్రమంలో స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మేనేజిమెంట్ సిస్టమ్ ద్వారా చేపల బుకింగ్ సేవలను అమలు చేస్తున్నారు. దీని ద్వారా మత్స్యకారులు, వ్యాపారులు సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫెడరేషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం, 2026 జూన్ నెలలో ఆన్‌లైన్ ద్వారా మొత్తం 25.36 లక్షల చేపల విక్రయాలు నమోదయ్యాయి. వీటిలో సాధారణ బుకింగ్‌ల ద్వారా 14.63 లక్షల చేపలు విక్రయించగా, బుకింగ్ లేకుండా జరిగిన విక్రయాలు 10.73 లక్షలుగా నమోదయ్యాయి. అలాగే జూన్ 21న ఒక్కరోజే 1.55 లక్షల చేపల ఆన్‌లైన్ విక్రయాలు నమోదవగా, జూన్ 22న 1.56 లక్షల చేపల విక్రయాలతో మరో రికార్డు నమోదైంది. ఈ కొత్త విధానం ద్వారా మత్స్య వ్యాపారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు మత్స్యకారులకు న్యాయమైన అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.
0 Comments