'బాస్ స్కామ్' లేదా 'సీఈవో ఇంపర్సొనేషన్ ఫ్రాడ్' అనే సరికొత్త సైబర్ నేరం కలకలం రేపుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు, వ్యాపార యజమానులు మరియు సామాన్య పౌరులు ఈ తరహా మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ బుధవారం ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్  నివేదికల ప్రకారం.. సైబర్ కేటుగాళ్లు కంపెనీల ఉన్నతాధికారులు, సీఈఓల పేర్లను వాడుకుంటూ కింది స్థాయి సిబ్బందిని టార్గెట్ చేస్తున్నారు. ఆఫీస్ అత్యవసర పనుల నెపంతో ఈమెయిల్స్ లేదా వాట్సాప్ ద్వారా మాల్‌వేర్‌తో కూడిన ఫైళ్లను పంపుతున్నారు. దేశవ్యాప్తంగా కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ తరహా మోసాలపై 300కు పైగా ఫిర్యాదులు రావడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ స్కామ్‌లో నేరగాళ్లు అనుమానం రాకుండా ఉండేందుకు ZIP లేదా RAR ఫార్మాట్లలో ఉండే ఫైళ్లను పంపిస్తారు. బాధితులు పొరపాటున ఆ ఫైళ్లను క్లిక్ చేయగానే, వారి కంప్యూటర్ లేదా మొబైల్‌లోకి ప్రమాదకరమైన మాల్‌వేర్ ప్రవేశిస్తుంది. దీని సహాయంతో హ్యాకర్లు బాధితుల వాట్సాప్ వెబ్ (WhatsApp Web) సెషన్లను, ఇతర వ్యక్తిగత వివరాలను ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ తర్వాత సదరు ఉద్యోగి పైఅధికారి (బాస్) లాగా నటిస్తూ.. అకౌంట్స్ విభాగం లేదా ఇతర సిబ్బందికి అత్యవసరంగా డబ్బులు పంపాలంటూ లేదా గోప్యమైన సమాచారం ఇవ్వాలంటూ మెసేజ్‌లు పెట్టి ఒత్తిడి తెస్తారు. ఈమెయిల్స్ లేదా వాట్సాప్‌లలో ‘అత్యవసరం’ అని వచ్చే అనుమానాస్పద లింకులను, ఫైళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు. పైఅధికారుల పేరుతో డబ్బులు పంపాలని మెసేజ్ వస్తే, వెంటనే ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయకుండా, నేరుగా వారికి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. ఒకవేళ మీ ఆఫీసులో ఇలాంటి ‘బాస్ స్కామ్’ జరిగినట్లు అనుమానం వస్తే, తక్షణమే ఆ సందేశాలకు రిప్లై ఇవ్వడం ఆపేసి, మీ సంస్థ ఐటీ విభాగానికి మరియు సైబర్ పోలీసులకు తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయాలని శిఖా గోయల్ స్పష్టం చేశారు.