Ad Code

రూ. 50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్ పట్టుకున్న పోలీసులు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బాటసింగారం పరిసరాల్లో తెలంగాణ ఈగల్​ ఫోర్స్ అధికారులు, హైదరాబాద్​ నార్కోటిక్స్​ బృందం, మల్కాజిగిరి పోలీసులు, ఎల్బీనగర్​ జోన్​ క్లూస్​ టీం సంయుక్తంగా జరిపిన మెరుపుదాడిలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం బయటపడింది. ఈగల్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కీసరి మత్స్యగిరి అలియాస్ నరేశ్ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలో ప్రధాన సూత్రధారి. ఇతనికి దశాబ్దానికి పైగా నేర చరిత్ర ఉంది. 2015 నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి గతంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. పోలీసుల కళ్లు గప్పేందుకు ఈసారి ‘ఫేషియల్ గ్లో పౌడర్’ తయారు చేస్తున్నామంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన రావుల మహేశ్ అనే వ్యక్తిని సంప్రదించాడు. ఒక మామిడి తోటలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మహేష్‌ను నెలకు రూ. 10 వేల జీతం ఇస్తానని నమ్మించి, అతని షెడ్డునే డ్రగ్స్ ల్యాబ్‌గా మార్చాడు. ప్రభాకర్ అనే వ్యక్తి నుంచి రూ. 60 వేలకు ముడిపదార్థాలు, రసాయనాలు, ల్యాబ్ పరికరాలను కొనుగోలు చేసి ఆ తోటలోని షెడ్డుకు తరలించారు. అక్కడ రెండు కిలోల ముడి మెఫెడ్రోన్ నుంచి సుమారు 750 గ్రాముల స్వచ్ఛమైన మెఫెడ్రోన్  డ్రగ్‌ను సిద్ధం చేశారు. తయారు చేసిన డ్రగ్స్‌ను విక్రయించేందుకు కీసరి మత్స్యగిరి, నిమ్మల నరేశ్ అనే వ్యక్తితో కలిసి రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని శ్రీసాయి హెచ్​ఎండీఏ వేబ్రిడ్జి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పక్కా సమాచారంతో పొంచి ఉన్న రక్షణ దళాలు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్, ఒక కారు, మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తోటలోని తయారీ కేంద్రంపై దాడి చేసి రసాయనాలను, పరికరాలను సీజ్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సంతోశ్ సింగ్, విజయ్, ప్రభాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu