Ad Code

ఆఫ్ఘనిస్తాన్‌ను 300 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసిన భారత్


న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను 300 పరుగుల భారీ తేడాతో భారత్ చిత్తు చేసింది. అయితే, ఇంతటి ఘనవిజయం నమోదైనప్పటికీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో టీమిండియా స్థానంలో ఎలాంటి మార్పు రాలేదు. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు 48.15 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలోనే కొనసాగుతోంది. ముల్లన్‌పూర్ స్టేడియంలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో 300 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేశారు. భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌ను 564/8 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు భారత బౌలర్ల దాటికి కేవలం 152 పరుగులకే కుప్పకూలింది. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆరు వికెట్లతో ఆఫ్ఘనిస్తాన్‌ నడ్డి విరిచాడు. భారత్ ఫాలోఆన్ ప్రకటించడంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హష్మతుల్లా షాహిదీ సేన, మరోసారి చేతులెత్తేసింది. ఈసారి వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో ఆఫ్ఘన్‌ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఇంతటి భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, డబ్ల్యూటీసీ పట్టికలో మార్పు లేకపోవడానికి ప్రధాన కారణం ఉంది. ఈ ఏకైక టెస్టు మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పరిధిలోకి రాదు. ఇది కేవలం ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా జరిగిన ప్రత్యేక మ్యాచ్ మాత్రమే. ప్రస్తుత డబ్ల్యూటీసీ సీజన్‌లో భారత్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించింది. ప్రస్తుత పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, న్యూజిలాండ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ 58.33 శాతంతో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉంది. లార్డ్స్ టెస్టులో న్యూజిలాండ్‌ను ఓడించిన ఇంగ్లాండ్ ఏడో స్థానంలో ఉండగా, పాకిస్తాన్, వెస్టిండీస్ పట్టికలో ఆఖరి స్థానాల్లో నిలిచాయి.

Post a Comment

0 Comments

Close Menu