దేశీయ మార్కెట్లో జూన్ 29న శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ వేదికగా శాంసంగ్ అధికారికంగా ప్రకటించింది. గతంలో వచ్చిన ఎం44 గ్లోబల్ మార్కెట్‌కే పరిమితం కాగా, ఇప్పుడు ఈ సిరీస్‌ను భారీ అప్‌డేట్స్‌తో భారత్‌లో విడుదల చేస్తుండటం విశేషం. ఈ ఫోన్‌లో శాంసంగ్ స్నాప్‌డ్రాగన్ ప్రొసెసర్‌ను ఉపయోగించనుంది. దీనికి తోడు LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీలను ఇస్తుండటంతో మల్టీటాస్కింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి. అంతేకాదు.. దీనిలో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 'బైపాస్ ఛార్జింగ్' ఫీచర్‌ను కూడా ఇస్తున్నారు. దీనివల్ల గేమ్స్ ఆడేటప్పుడు బ్యాటరీ వేడెక్కకుండా నేరుగా ఫోన్‌కు పవర్ అందుతుంది. మిడ్‌రేంజ్ విభాగంలో ఈ ఫోన్‌కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్. గెలాక్సీ M47 5G కొనుగోలు చేసిన వారికి 6 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్, 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. సుదీర్ఘ కాలం పాటు కొత్త ఫోన్ లాంటి ఫీలింగ్‌ను ఇది యూజర్లకు అందిస్తుంది. ఈ ఫోన్‌లో 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు OIS సపోర్ట్ ఉన్న 50MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రావైడ్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ప్రత్యేకత ఏంటంటే.. ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
0 Comments