షాదీ ముబారక్ పథకం : రూ.21 లక్షల ప్రభుత్వ నిధులు పక్కదారి : బండ్లగూడ ఆర్ఐతో సహా అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'షాదీ ముబారక్' పథకాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ సొమ్మును కొల్లగొడుతున్న ఒక అంతరాష్ట్ర ముఠాను అత్తాపూర్ పోలీసులు రట్టు చేశారు. నకిలీ పత్రాలతో ఏకంగా రూ.21 లక్షల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన ఈ కేసులో, బండ్లగూడ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ధరావత్ అశోక్ కిరణ్‌తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హసన్‌నగర్‌లోని ఫాతిమా కాలనీలో నకిలీ దరఖాస్తులు ముద్రితమవుతున్నాయనే పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఎతిమాద్ ఉల్ హక్ ఇంట్లో భారీ ఎత్తున ఫోర్జరీ పత్రాలు, కంప్యూటర్ సాగగ్రీ, మొబైల్ ఫోన్లు, ప్రభుత్వ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అస్సలు పెళ్లిళ్లే జరగకపోయినా, జరిగినట్లుగా నకిలీ వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ వంటి ఇతర ఐడీ ప్రూఫ్‌లను వీరు సృష్టించేవారు. ఈ నకిలీ పత్రాలకు రెవెన్యూ అధికారి సహకారంతో షాదీ ముబారక్ నిధులు మంజూరయ్యేలా స్కెచ్ వేశారు. నిందితుల నుంచి రూ.21 లక్షల విలువైన 21 ప్రభుత్వ చెక్కులను, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్, ఆరు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org