దేశీయ మార్కెట్లో జూలై 2న ఒప్పో రెనో 16 ప్రో గ్రాండ్‌గా విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా 'ఒప్పో రెనో 16 ప్రో' గ్లోబల్ వేరియంట్ ప్రముఖ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్ గీక్‌బెంచ్‌లో ప్రత్యక్షమైంది. ఈ లీక్ ద్వారా ఫోన్ సామర్థ్యం, ప్రాసెసర్, సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. సీపీహెచ్2863 (CPH2863) అనే మోడల్ నంబర్‌తో ఒక సరికొత్త ఒప్పో స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ వేదికపై కనిపించింది. వివిధ అంతర్జాతీయ సర్టిఫికేషన్ నివేదికల ప్రకారం, ఈ మోడల్ నంబర్ మరేదో కాదు, ఒప్పో రెనో 16 ప్రో గ్లోబల్ వేరియంట్ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లీక్ స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో అంచనాలను భారీగా పెంచేసింది.ఒప్పో రెనో 16 ప్రో శక్తివంతమైన మీడియాటెక్ ఎంటీ6899 చిప్‌సెట్‌తో పనిచేయనుంది. దీనిని మార్కెట్లోకి మీడియాటెక్ డైమెన్సిటీ 8550 ప్రాసెసర్‌గా పిలిచే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇది 8 కోర్ల అద్భుతమైన నిర్మాణంతో రూపుదిద్దుకుంది. ఇందులో అత్యధికంగా ఒక కోర్ 3.40 గిగాహెర్ట్జ్ వేగంతో, మరో 3 కోర్లు 3.20 గిగాహెర్ట్జ్ వేగంతో, మిగిలిన 4 కోర్లు 2.20 గిగాహెర్ట్జ్ బేస్ వేగంతో పనిచేస్తాయి. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలీ-జీ720 ఎంసీ8 గ్రాఫిక్స్ కార్డ్‌ను అమర్చారు. 11.18 జీబీ ర్యామ్ సామర్థ్యంతో గీక్‌బెంచ్‌లో నమోదైంది. దీనిని కంపెనీ మార్కెట్లోకి 12 జీబీ ర్యామ్ వేరియంట్‌గా పరిచయం చేయనుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తున్నట్లు లీకైంది. దీనిపై ఒప్పోకు చెందిన సొంత కలర్ ఓఎస్ 16 లేయర్ ఉండనుంది. అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. గీక్‌బెంచ్ 6.7.1 పరీక్షల్లో ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్టులో 1,575 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 5,889 పాయింట్లు సాధించి తన సత్తా చాటింది. సాధారణ మోడల్ అయిన ఒప్పో రెనో 16 (స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్) సాధించిన స్కోర్ల (సింగిల్-కోర్: 1,240, మల్టీ-కోర్: 3,994) కంటే ప్రో వేరియంట్ ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంది. దీనిని బట్టి చూస్తే భారీ గేమ్స్ ఆడేవారికి, మల్టీటాస్కింగ్ చేసేవారికి ఈ ఫోన్ అద్భుతంగా సరిపోతుందని చెప్పవచ్చు.
0 Comments