Ad Code

తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం : 17 నకిలీ సంస్థలతో ₹98 కోట్లు స్వాహా !

తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగుచూసింది. 17 నకిలీ కంపెనీల నెట్‌వర్క్‌ను సృష్టించి, రూ.98.47 కోట్ల మేర నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పొందినట్లు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నిర్ధారించింది. ఈ పన్ను ఎగవేతకు పాల్పడిన షా బ్యాటరీస్ డైరెక్టర్‌ టి.ఎ. ఆమిర్ హసన్ ను అధికారులు మంగళవారం అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. వాణిజ్య పన్నుల శాఖ జరిపిన ప్రాథమిక విచారణలో అత్యంత వ్యవస్థీకృతమైన పన్ను ఎగవేత నెట్‌వర్క్ బయటపడింది. షా బ్యాటరీస్ (GSTIN: 36ABNCS3639N1ZK) డైరెక్టర్ టి.ఎ. ఆమిర్ హసన్ (తండ్రి: అబ్దుల్ అహద్ బాబు) తన అనుచరుల సహాయంతో 17 నకిలీ కంపెనీలను పుట్టించాడు. ఈ సంస్థల ద్వారా కేవలం కాగితాలపైనే బిల్లులు సృష్టించి, అక్రమంగా ఐటీసీని షా బ్యాటరీస్‌కు బదిలీ చేశాడు. పన్ను క్రెడిట్ మొత్తాన్ని బదిలీ చేసిన వెంటనే ఈ 17 కంపెనీల జీఎస్టీ రిజిస్ట్రేషన్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకున్నారు. అయితే, డిజిటల్ డేటా అనాలిసిస్ చేయగా ఈ 17 బోగస్ కంపెనీల నెలవారీ జీఎస్టీ రిటర్న్స్  అన్నీ ఒకే కంప్యూటర్  నుండి ఫైల్ అయినట్లు అధికారులు గుర్తించారు. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రభుత్వ ఖజానాకు ఈ సంస్థ భారీగా గండి కొట్టింది. ఏప్రిల్ 2025 నుండి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో షా బ్యాటరీస్ సంస్థ ఏకంగా ₹571 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. ఇంత భారీ వ్యాపారం జరిగినప్పటికీ, కంపెనీ నగదు రూపంలో చెల్లించిన పన్ను కేవలం ₹45.42 లక్షలు మాత్రమే. మిగిలిన వందల కోట్ల ట్యాక్స్ లయబిలిటీని చెల్లించడానికి, సదరు డైరెక్టర్ ఈ 17 బోగస్ కంపెనీల ద్వారా సృష్టించిన ₹98.47 కోట్ల నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను ఉపయోగించుకున్నాడు. తెలంగాణ జీఎస్టీ చట్టం, 2017 (TGST Act) ప్రకారం ఈ అరెస్ట్ ప్రక్రియ చట్టబద్ధంగా జరిగింది. ఈ అవకతవకలను సరిదిద్దుకోవడానికి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి డైరెక్టర్ ఆమిర్ హసన్‌కు గత రెండు నెలలుగా వాణిజ్య పన్నుల శాఖ తగినన్ని అవకాశాలు ఇచ్చింది. అయినప్పటికీ అతను స్పందించకపోవడం, నేరం తీవ్రత చాలా పెద్దది కావడంతో లీగల్ ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో నకిలీ ఇన్‌వాయిస్‌లు, బిల్ ట్రేడింగ్, బోగస్ ఐటీసీ క్లెయిమ్‌ల ద్వారా పన్నులు ఎగవేసే ముఠాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని విభాగం హెచ్చరించింది. ఈ స్కామ్‌లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో షా బ్యాటరీస్‌పై విచారణ కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu