అమెరికాలోని ఓహియో స్టేట్, టోలెడో నగరంలో ఎంతో ఉత్సాహంగా సాగుతున్న సాంప్రదాయ వేసవి ఉత్సవం 'ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్' ఒక్కసారిగా రక్తసిక్తమైంది. కమ్యూనిటీ ఫెస్టివల్‌లో ఇద్దరు దుండగులు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పులు అక్కడ లైవ్ మ్యూజిక్ వింటూ ఆహ్లాదంగా గడుపుతున్న అమాయక ప్రజలకు శాపంగా మారాయి. ఈ విచక్షణారహిత కాల్పుల్లో 12 మంది బుల్లెట్ గాయాలపాలవగా, ఘటనా స్థలం నుండి తప్పించుకున్న నిందితుల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. నగరంలోని చారిత్రక ప్రాంతంలో ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్' ముగింపు వేడుకల సందర్భంగా శనివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన ఒక ఉద్యానవనంలో స్థానికులు తమ కుటుంబాలు, పిల్లలతో కలిసి కూర్చుని లైవ్ మ్యూజిక్ వింటూ ఆనందంగా గడుపుతున్నారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం గొడవ పడుతూ.. ఒకరిపై ఒకరు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుకోవడం ప్రారంభించారు. హఠాత్తుగా పెద్ద పెట్టున వినిపించిన తుపాకీ శబ్దాలతో ఉత్సవానికి వచ్చిన వందలాది మంది ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. తప్పించుకునే మార్గం లేక చాలామంది ప్రాణాలు దక్కించుకోవడానికి నేలపైనే బోర్లా పడుకున్నారు.
0 Comments