Ad Code

సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్య !


తెలంగాణ లోని సూర్యాపేట జిల్లాలో మాజీ సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య స్థానికంగా కలకలం రేపింది. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన మధు మృతదేహం ఎల్కారం స్టేజ్ సమీపంలో గోనె సంచిలో శవమై లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం, సూర్యాపేట రూరల్ పరిధి ఎల్కారం గ్రామానికి చెందిన చింతలపాటి మధు నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లారు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టవర్ లొకేషన్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులకు తెల్లవారుజామున కల్వర్ట్ కింద కట్టిపడేసి ఉన్న మధు మృతదేహం కనిపించింది. దుండగులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో జరిగిన రెండు హత్య కేసులతో మధుకు సంబంధం ఉండటంతో ఇది రాజకీయ పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మధు కాంగ్రెస్ నాయకుడు మిద్దె రవీందర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో A1 ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉండగానే మధు హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాత పగలతో తెలిసిన వారే నమ్మకంగా పిలిపించి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ ఆదేశాలతో 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుడి భార్య మాట్లాడుతూ గ్రామానికి చెందిన మారుపల్లి సతీష్, కుంటి గోర్ల సూరి, కందుల నాగయ్య, కట్టబోయిన మల్లయ్య, బొర్రా అరుణ్, మిద్దె జీవన్ కలిసి తన భర్తను హత్య చేశారని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu