ఢిల్లీలో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక యువతిని నమ్మించి, లక్నోలోని ఒక ఫ్లాట్‌లో మూడు రోజుల పాటు బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు యువతి సెలవుల కోసం జౌన్‌పూర్ వెళ్ళి, తిరిగి ఢిల్లీకి వెళ్లేందుకు సుహేల్దేవ్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. ఆ ప్రయాణంలో తనకు నాలుగేళ్లుగా తెలిసిన శివమ్ యాదవ్‌కు వాట్సాప్ మెసేజ్ చేయగా, లక్నోలోని చార్‌బాగ్ స్టేషన్ వద్ద శివమ్ మరియు అతని స్నేహితుడు సన్నీ యాదవ్ ఆమెను కలిసి, నమ్మించి రైలు దిగేలా చేసి ఒక అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లారు. ఫ్లాట్‌కు తీసుకెళ్లిన తర్వాత, శివమ్ ఆమె తాగే కాఫీలో మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశాడు. మరుసటి రోజు శివమ్ లేని సమయంలో సన్నీ యాదవ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారు బయటకు వెళ్లేటప్పుడు ఫ్లాట్‌కు బయట నుండి తాళం వేసి వెళ్లేవారు. మే 17న ఫ్లాట్‌లోకి మరొక అపరిచిత వ్యక్తి వచ్చి, మే 18 మధ్యాహ్నం వరకు ఆ ముగ్గురూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 18న ఆ దుండగులు ఆమెను మళ్లీ చార్‌బాగ్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఢిల్లీకి వెళ్లే రైలులో కూర్చోబెట్టారు. రైలు బరేలీ దగ్గరకు చేరుకున్నాక, బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని వివరించింది. బాధితురాలి తండ్రి రైల్వే హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించగా, పోలీసులు ఆమెను రక్షించి ఢిల్లీలోని ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించి 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేశారు. బాధితురాలు తీవ్ర షాక్‌లో ఉండగా, నిందితులను వెంటనే ఎన్‌కౌంటర్ చేసి శిక్షించాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. లక్నో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
0 Comments