హైదరాబాద్ నుంచి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ బస్టాండ్ వద్ద చెకింగ్ అధికారి ప్రకాష్ తనిఖీ చేశారు. అయితే, చెకింగ్‌లో భాగంగా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని గుర్తించిన ప్రకాష్, సదరు ప్రయాణికుడికి జరిమానా వేయడంతో పాటు, కండక్టర్‌పై ఛార్జ్ మెమో ఇవ్వకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు. ఈ  తంతంగమంతా గమనించిన ప్రయాణికులు అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ సమీపంలోనే చెకింగ్ అధికారి వాహనాన్ని అడ్డుకుని నిలదీశారు. పంచాయితీ కాస్తా ముదరడంతో కండక్టర్, ప్రయాణికులు కలిసి చెకింగ్ అధికారి ప్రకాశ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ పరిణామంతో రాయికోడ్ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారి ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కండక్టర్‌తో పాటు ప్రయాణికులు కూడా సిద్ధమయ్యారు.