ఒడిశా లోని జాజ్‌పూర్ జిల్లా దసరథ్‌పూర్ బ్లాక్ పరిధిలోని పతాపూర్ గ్రామంలో కలుషిత ఆహారం తిని సుమారు 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 27 మంది చిన్నారులు ఉండటం గమనార్హం. స్థానికంగా ఒక వ్యాపారి వద్ద 'కటక్ దహీవడ' (పెరుగు వడ) తిన్న కొద్దిసేపటికే గ్రామస్తులు వాంతులు, జ్వరం, కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. పరిస్థితి విషమించడంతో వారందరినీ దసరథ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మరియు జాజ్‌పూర్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ మహలింగ్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రాథమిక విచారణలో దహీవడ తినడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించామని, ఆహారం మరియు నీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపినట్లు మంత్రి మీడియాకు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. జాజ్‌పూర్ జిల్లా కలెక్టర్ అంబర్ కుమార్ కర్ కూడా రోగులను పరామర్శించారు. చికిత్స పొందిన వారిలో 21 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేసింది. ఆహార భద్రతలో వైఫల్యాలు ఎక్కడ జరిగాయో ఈ కమిటీలు పరిశీలించనున్నాయి. ప్రస్తుతం బాధితులందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
0 Comments