Ad Code

క్రతువు ముగింపు సందర్భంగా నర్మదా నదికి క్షీరాభిషేకం : భగ్గుమన్న పర్యావరణవేత్తలు : పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు


ధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లా భేరుండా తహసీల్‌లో పాతాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో దాదాజీ ధునివాలే బాబా అనే మత గురువు ఆధ్వర్యంలో 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రతువు ముగింపు సందర్భంగా ఏకంగా ఒక భారీ ట్యాంకర్ నిండా ఉన్న 11,000 లీటర్ల పాలను నర్మదా నదిలో పోశారు. డ్రోన్ ద్వారా తీసిన ఈ దృశ్యాలు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు 'పోషకాహార లోపం'. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం, మధ్యప్రదేశ్‌లో పోషకాహార లోపం రేటు 7.79 శాతంగా ఉంది. ఇది దేశ సగటు (5.40%) కంటే చాలా ఎక్కువ. దాదాపు 1.36 లక్షల మంది చిన్నారులు ప్రస్తుతం ఈ సమస్య వల్ల మృత్యువుతో పోరాడుతున్నారు. ఇలాంటి రాష్ట్రంలో ఇన్ని వేల లీటర్ల పాలను ఆకలితో ఉన్న పిల్లలకు కాకుండా నదిలో పారబోయడం ఎంతవరకు సబబని మేధావులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, పోషకాహార లోపంపై ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి.  సామాన్యంగా పోషకాహార లోపంతో ఉన్న చిన్నారికి రోజుకు రూ. 8, తీవ్రమైన లోపం ఉన్నవారికి రూ. 12 మాత్రమే కేటాయిస్తున్నారు. ఆవు గ్రాసం కోసం రోజుకు రూ. 40 కేటాయిస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఎండగట్టాయి. ఒక పూట పాలు కూడా సరిగ్గా దొరకక చిన్నారులు మంచాన పడుతుంటే, వేల లీటర్ల పాలను వృధా చేయడం పట్ల విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నర్మదా నదిని రక్షించేందుకు కోర్టులు, ఎన్జీటీ కఠినమైన ఉత్తర్వులు ఇచ్చాయి. నదిలోకి ఎలాంటి వ్యర్థాలు లేదా పదార్థాలను వదలకూడదనే నిబంధన ఉంది. పర్యావరణవేత్త భావన మీనన్ మాట్లాడుతూ "నదిలో పాలు కలవడం అనేది సహజమైన ప్రక్రియ కాదు. ఇది అక్కడి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తుంది. రాబోయే తరాలకు మనం ఏం ఇస్తున్నాం?" అని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాది అంశుమన్ సింగ్ మాట్లాడుతూ, నర్మదను తల్లిగా పూజిస్తూనే, ఆ తల్లికి నష్టం కలిగించే ఇలాంటి పనులను మానుకోవాలని, భక్తికి, పర్యావరణ స్పృహకు మధ్య ఒక గీత గీయాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu