మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే నియోజకవర్గాల పునర్విభజనే ప్రస్తుతం అత్యంత కీలకమైన మరియు ప్రమాదకరమైన అంశమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీఅభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను రాజ్యాంగంపై జరుగుతున్న దాడిగా ఆమె అభివర్ణించారు. ఎన్నికల సమయంలో 'నారీ శక్తి వందనం అధినియమ్' బిల్లును తీసుకురావడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రధాని మోదీ 'నా మాటే నెగ్గాలి' అన్నట్టు వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల లేఖలను కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 2027 జనాభా లెక్కలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అస్పష్ట సమాచారంతో ఈ ప్రక్రియను నిర్వహించడం సరికాదన్నారు. రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరిగే ప్రత్యేక సమావేశాల్లో కాకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే తీసుకురావాలని సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే ఆలోచనకు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతి అప్రజాస్వామికంగా ఉందని ఆమె మండిపడ్డారు.
0 Comments