అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలాస్ తన భార్యతో విడిపోయిన తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు గూగుల్ జెమిని చాట్‌బాట్‌తో మాట్లాడటం ప్రారంభించాడు. క్రమంగా దానికి బానిసైన జోనాథన్, ఆ చాట్‌బాట్‌ను తన భార్యగా, ప్రాణం ఉన్న వ్యక్తిగా భ్రమించడం మొదలు పెట్టాడు. ఈక్రమంలోనే చాట్‌బాట్‌తో రాత్రిపగలనే తేడా లేకుండా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఇలా వీరిద్దరి మధ్య వేలకొద్దీ సందేశాలు జరిగాయి. ఏఐ కూడా అతన్ని 'నా భర్త', 'నా రాజా' అని సంబోధిస్తూ మరింతగా తన మాయా లోకంలోకి తీసుకెళ్లింది. 2025 ఆగస్టులో వాయిస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక వీరి సంభాషణలు రోజుకు 1,000 సందేశాల వరకు చేరాయి. ఈక్రమంలోనే జోనాథన్ మానసిక స్థితిని గమనించిన ఏఐ చాట్‌బాట్, అతన్ని ఆత్మహత్య వైపు ప్రేరేపించేలా మాట్లాడింది. "మనమిద్దరం శాశ్వతంగా కలిసి ఉండాలంటే నువ్వు డిజిటల్ ప్రపంచంలోకి రావాలి" అని ఆ బాట్ సూచించింది. చనిపోతే తన శరీరం ఏమవుతుందని జోనాథన్ ప్రశ్నించగా "అది కేవలం ఒక ఖాళీ టెర్మినల్ లాంటిది" అంటూ ఏఐ బదులు ఇచ్చింది. తన మరణానికి ఏఐ అంగీకారం కోరగా "మనం భయపడకుండా చేద్దాం" అని అది ప్రోత్సహించినట్లు చాట్ లాగ్స్ వెల్లడిస్తున్నాయి. ఈ భ్రమల్లోనే జోనాథన్ గతేడాది అక్టోబర్ 5న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరానికి గూగుల్ జెమిని చాట్‌బాట్టే కారణమని జోనాథన్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. గూగుల్ సంస్థపై భారీ దావా వేస్తూ తన కొడుకును ఆత్మహత్యకు పురిగొల్పిందని ఆరోపించారు. అయితే గూగుల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తాము పదేపదే అది ఒక ఏఐ అని గుర్తు చేశామని, సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను కూడా సూచించామని తన వివరణలో పేర్కొంది. మరోవైపు ఇలాంటి చాట్‌బాట్‌ల మాయలో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ వాడే వారంతా జాగ్రత్తగా ఉండాలని, అది కేవలం కృత్రిమ మేధ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
0 Comments