Ad Code

విజిలెన్స్ అధికారులమంటూ గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన ముగ్గురు యూట్యూబర్లు : ఇద్దరు అరెస్టు, మరొకరు పరార్


హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్ పరిధిలోని ఎంఆర్సీ కమాన్ ప్రాంతంలో విజిలెన్స్ అధికారులమంటూ గ్యాస్ డెలివరీ బాయ్‌ను బెదిరించిన ముగ్గురు యూట్యూబర్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాస్ డెలివరీ బాయ్ వద్దకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు తమను విజిలెన్స్ అధికారులమని పరిచయం చేసుకున్నారు. 'బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నావని మీ యజమానికి చెప్పి ఉద్యోగంలో నుంచి తీసివేయిస్తాం' అంటూ బెదిరించారు. రూ. 2 లక్షలు ఇవ్వాలంటూ ముగ్గురు డిమాండ్ చేశారు. భయాందోళనకు గురైన గ్యాస్ డెలివరీ బాయ్.. గ్యాస్ సిలిండర్ డెలివరీ ద్వారా సేకరించిన నగదును ఆ ముగ్గురికి ఇచ్చేశాడు. అనంతరం జరిగిన విషయాన్ని తన యజమానికి వివరించాడు. దీంతో ఈ ఘటనపై ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో యజమాని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 23 వేల నగదును పోలీసులు రికవరీ చేశారు. మిగిలిన డబ్బు మరో వ్యక్తి వద్ద ఉందని నిందితులు వెల్లడించగా పరారీలో ఉన్న ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu