Ad Code

బైక్‌ టాక్సీపై వెళ్తున్న మహిళ పట్ల నడిరోడ్డుపై అసభ్య ప్రవర్తించిన దుండగులు : సోషల్ మీడియాలో వీడియో వైరల్


రాజస్థాన్ లోని జైపూర్‌లో పట్టపగలు, జనం రద్దీగా ఉండే రోడ్డుపై బైక్ టాక్సీపై వెళ్తున్న ఓ మహిళను ఇద్దరు దుండగులు వేధించిన తీరు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ అమానుషానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఏప్రిల్ 8న వెలుగులోకి వచ్చిన ఈ 15 సెకన్ల వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బాధితురాలు ఒక బైక్ టాక్సీపై ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను వెంబడించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి మహిళకు దగ్గరగా వాహనాన్ని తీసుకెళ్లగా, వెనుక కూర్చున్న నిందితుడు అత్యంత అసభ్యకరంగా ఆమెను తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సింది పోయి, నిందితులు తమ పైశాచికత్వాన్ని ఫోన్‌లో రికార్డ్ చేయడం వారి బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఘటన రద్దీగా ఉన్న ప్రధాన రహదారిపైనే జరిగినప్పటికీ, చుట్టుపక్కల వారు ఎవరూ అడ్డుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నడిరోడ్డుపై ఒక మహిళకు అన్యాయం జరుగుతున్నా ఎవరూ స్పందించకపోవడం పట్ల సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. పబ్లిక్ ప్రదేశాల్లో మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేసే ఇటువంటి ఘటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని జైపూర్ పోలీసులను ఎన్సీఐబీ ఆదేశించింది. దీనిపై స్పందించిన జైపూర్ పోలీసులు, కేసును సంబంధిత అధికారులకు బదిలీ చేశామని, నిందితుల వేట కొనసాగుతోందని వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu